Food

గుబ్బకాయలు లేదా సీమచింత తెలుసా?

gubbakayalu

కొన్ని పండ్లను చూస్తే వాటి రుచి గుర్తొస్తుంది. మరికొన్నింటిని చూస్తే ఆరోగ్యం స్ఫురిస్తుంది. కానీ అరుదుగా ఆ కాలంలో మాత్రమే కనిపించే కొన్ని పండ్లు మాత్రం చిన్ననాటి జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంటాయి. ఆ కోవకు చెందినవే ఇవి…
**ఒకప్పుడు వేసవిసెలవులు రావడం ఆలస్యం… పిల్లలంతా గెడకర్రలేసుకుని కంచెల్లోని సీమచింత కాయలను మెడలు పడిపోయేలా కష్టపడి కోయడమూ; జీడిమామిడితోటల్లోకి దూరి, చేతికందిన పండ్లను తెంపడమూ… వాటిని పంచుకుని ఆ వగరు రుచుల్నే ఎంతో ఇష్టంగా తిన్న నాటి తరం ఆనందానికి వెలకట్టడం నేటి తరానికి సాధ్యం కాదు. అందుకే ఆ మధుర జ్ఞాపకాల్ని తలచుకుంటూ ఆ రుచిని ఆస్వాదించేందుకన్నట్లు ఆ పల్లె పండ్లన్నీ
పట్టణాలకు తరలివస్తున్నాయి.
**అందాల జీడిపండు..!
ముదురు ఎరుపూ నారింజా పసుపూ రంగుల్లో చూడగానే తినాలనిపించే జీడిపండ్లు కొరికితే వగరు కలిసిన తీపితో మంచివాసనతో జ్యూసీగా ఉంటాయి. లాటిన్‌ అమెరికన్లకు వేసవిలో ఈ పండుతో చేసిన జ్యూసే తాజా షర్బత్‌. కొద్దిపాళ్లలో పిండిపదార్థాలతోబాటు ఫాస్ఫరస్‌, ఐరన్‌, కెరోటిన్‌, విటమిన్‌-సి, పొటాషియం, పీచు… వంటివన్నీ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ ఎక్కువే. అందుకే అల్సర్లూ గ్యాస్ట్రైటిస్‌లతో బాధపడేవాళ్లకి ఇవి మందులా పనిచేస్తాయి. దీని జ్యూస్‌ని జలుబుకీ మందులా వాడతారు. గొంతుమంట, అమీబిక్‌ డీసెంట్రీ వంటి వ్యాధులకీ టానిక్‌లా పనిచేస్తుంది. ఈ పండ్లను ఎండబెట్టీ లేదా జ్యూస్‌ని మరిగించి సిరప్‌ రూపంలోను కూడా నిల్వచేస్తుంటారు. ఈ పండ్ల నుంచి తీసిన రసాయనాలని సౌందర్యోత్పత్తులూ, క్యాన్సర్ల మందుల్లో వాడుతున్నారట.
**ఫాల్సాపండు… మంచి షర్బత్‌!
ముదురు వంకాయ రంగులో చిన్నసైజు ద్రాక్షపండ్లని తలపించే ఈ పండ్లు ఒకలాంటి తీపీపులుపూ కలిసిన రుచిలో ఉంటాయి. వీటినే తెలుగులో ఫుటికి అనీ పిలుస్తారు. ఈ పండ్ల తొక్కలో యాంటీఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. ఈ పండ్లను నానబెట్టి చేత్తోనే పిసికి గింజల్ని తీసేసి జ్యూస్‌ చేసుకుని తాగుతారు. ఈ పండ్లరసం వేసవిలో చలువచేయడంతోబాటు డీహైడ్రేషన్‌కి మంచి టానిక్‌. అందుకే దీన్ని షర్బత్‌ ఫ్రూట్‌ అంటారు. ఈ పండ్లలో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, వంటి మూలకాలూ సి-విటమిన్‌ సమృద్ధిగా ఉంటాయి. పచ్చికాయలు రక్తశుద్ధికి తోడ్పడతాయి. జ్వరాన్నీ మంటనీ తగ్గిస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రణలో ఉంచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తాయి. బీపీ, కొలెస్ట్రాల్‌, పిత్తాశయం, కాలేయ సమస్యల్ని తగ్గిస్తాయి.
**చింత తీర్చే ‘సీమచింత’
జంగిల్‌ జిలేబీ, గంగా ఇమ్లి… అని కూడా పిలిచే ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా ఉన్నా పండిన తరవాత తియ్యగా ఉంటాయి. ఫిలిప్పీన్స్‌లో ఈ కాయలకోసం ఏకంగా తోటల్నే వేస్తుంటారు. ఈ కాయలతో కూరలూచేస్తుంటారు. మటన్‌, చికెన్‌లలోనూ వేస్తుంటారు. దగ్గుతుంటే రక్తం పడేవాళ్లకి ఈ పండ్లు ఎంతో మేలుచేస్తాయట. ఈ పండ్లలోని విటమిన్‌-సి రోగనిరోధకశక్తిని పెంచితే, బి-కాంప్లెక్స్‌ ఒత్తిడిని తగ్గించి ఆకలిని పెంచేందుకు తోడ్పడుతుంది. మధుమేహులకీ అల్సర్‌రోగులకీ ఈ పండ్లు మేలు చేస్తాయి. లైంగిక వ్యాధుల్నీ తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌నీ, పక్షవాతాన్నీ రాకుండానూ నిరోధిస్తాయి. గింజల్ని పొడి చేసి అల్సర్లకీ మందుగా వాడతారు. సంప్రదాయ వైద్యులే కాదు ఆధునిక పరిశోధకులు సైతం దీని ఆకులూ బెరడులతో క్యాన్సర్లూ పక్షవాతం… వంటి ఎన్నో వ్యాధుల్ని నివారించవచ్చనీ అందుకే ఇదో మిరకిల్‌ ట్రీ అనీ పేర్కొనడం విశేషం.
**మంచి మందు… ఈత పండు!
తియ్యని తొక్కతో కూడిన ఈతపండ్లను తింటుంటే ఓ గమ్మత్తైన అనుభూతి కలుగుతుంది. కాల్షియం, పీచు అధిక శాతంలో ఉండే ఈ పండ్లను తినడంవల్ల గొంతునొప్పి, పేగు సమస్యలు, జ్వరం, జలుబు, ఆస్తమా, కాలేయ, పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లు నడుంనొప్పినీ మూత్రసమస్యల్నీ వాంతుల్నీ కూడా తగ్గిస్తాయి. ఈ చెట్టు నుంచి తీసే తాజా కల్లుతో బెల్లం తయారుచేస్తుంటారు. సంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను జ్వరాలు,పొట్ట సమస్యలు, మలబద్ధకం, గుండెజబ్బులు తదితర వ్యాధులకి మందులా వాడుతుంటారు.