ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడేన్ ఐపీఎల్‌తో భారత్‌లో కూడా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. 2008-10 మధ్యకాలంలో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఆడిన హెడేన్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన హెడేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై వచ్చిన హెడేన్ మారు వేషంలో నగర వీధుల్లో తిరిగి షాపింగ్ కూడా చేశాడు. అతడ్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు లుంగీ కట్టుకొని నకిలీ గడ్డం, మీసంతో పాటు టోపిని పెట్టుకొని చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో షాపింగ్ చేశాడు. అక్కడి దుకాణాల్లో బేరమాడి మరీ ఈ వస్తువులని కొన్నాడట! రూ. 200 చేతి గడియారాన్ని రూ.180కు బేరమాడి దక్కించుకున్నాడట! ఇలా హెడేన్ చెన్నైలో చేసిన సాహసాన్ని ఇన్‌స్టాగ్రమ్‌లో రాసుకున్నాడు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు. రాజస్థాన్ జట్టు మెంటార్, హెడేన్ మాజీ సహచర ఆటగాడు షేన్ వార్న్ రూ.1000 కంటే తక్కువ డబ్బులతో షాపింగ్ చేయమని హెడేన్‌ను ఛాలెంజ్ చేశాడంట! దీంతో చెన్నైలోని టీనగర్ ప్రాంతానికి వెళ్లి రూ.1000తో లుంగీ, షర్టు, రజినీ సన్నీస్, వాచ్ ఇవన్నీ కొన్నానని హెడేన్ రాసుకున్నాడు. ‘వార్న్ ఛాలెంజ్‌ని నెగ్గడానికి నాకు ఒక స్థానిక బాలుడు సహకరించాడు. అతడికి రూ.100 ఇచ్చాను. వార్న్ ఛాలెంజ్‌ను నెగ్గానని గర్వంగా చెప్తున్నాను’ అంటూ హెడేన్ తన పోస్టులో రాసుకున్నాడు. మొదటి మూడు ఐపీఎల్ సీజన్‌ల్లో చెన్నై తరఫున ఆడిన హెడేన్ 34 ఇన్నింగ్స్‌లో 1,117 పరుగులు చేశాడు. రెండో సీజన్‌లో 572 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా హెడేన్ నిలిచాడు.
మారువేషంలో మాథ్యూ

Related tags :