Business

అత్యధికంగా పన్నులు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి

trump calls india tariff king

ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధించే దేశాల్లో భారత్‌ కూడా ఒకటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ హార్లీ డేవిడ్‌సన్‌ బైకులు వంటి కొన్ని రకాల వస్తువులపై 100శాతం పన్నులు విధిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అటువంటి అత్యధిక పన్నులు ఏమాత్రం మంచివికావని హితవు పలికారు. అమెరికాలోని నేషనల్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ కమిటీ వార్షిక సమావేశంలో మాట్లాడారు. ‘టారిఫ్‌ కింగ్‌’ అని భారత్‌ను పలుమార్లు ఎద్దేవా చేశారు. అమెరికా వస్తువులపై పన్నులను అద్భుతంగా వసూలు చేస్తుందని ఆయన అన్నారు. ‘‘భారత్‌ అత్యధిక పన్నులు విధించే దేశం. మన వస్తువులపై 100శాతం పన్నులు విధిస్తారు. కానీ వారు మాత్రం ఇక్కడ మోటార్‌ సైకిళ్లను విక్రయించి బాగా సంపాదిస్తారు. మనం హార్లీ డేవిడ్‌సన్‌ను పంపిస్తే మాత్రం 100శాతం పన్ను విధిస్తారు. ఇది ఏమాత్రం బాగోలేదు.’’ అని అన్నారు. చైనాతో చర్చలపై ట్రంప్‌ స్పందించారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ను ఒక రాజుతో ట్రంప్‌ పోల్చారు. ఆయన చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నారు. తాను రాజును కానని వివరించారు. కేవలం ఒక అధ్యక్షుడిని మాత్రమేనని పేర్కొన్నారు. నేను జిన్‌పింగ్‌తో మాట్లాడుతూ ‘‘నువ్వు జీవిత కాల అధ్యక్షుడివి. అందుకే నిన్ను రాజు అన్నాను. దానికి ఆయన హు..హు అని మాత్రమే స్పందించారు. నేను మాత్రం అమెరికా ప్రయోజనాలను చైనా దెబ్బతీస్తున్న తీరును మాత్రం బలంగా నిందించాను. అప్పుడు అక్కడ 5,000 మంది ఉన్నారు.. నేను చైనాలోని బీజింగ్‌లో ఉన్నాను.. మీరు నమ్మగలరా.. అప్పుడు షీజిన్‌పింగ్‌కు కోపం వచ్చింది. అది నాకు బాగా గుర్తుంది. కానీ మా దేశం వారే అలసు ఇచ్చారని చెప్పాను. మనం అటువంటివి ఇంకెప్పుడూ జరగకుండా చూసుకోవాలి.’’ అని ట్రంప్‌ గతాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. తన వాణిజ్య విధానాల వల్ల పలు దేశాలతో లోటు తగ్గినట్లు ఆయన చెప్పుకొన్నారు.