Politics

విశాఖ ఉత్తరంలో గజగజలాడుతున్న గంటా

will ganta win 2019 election

అనకాపల్లి ఎంపీగా… చోడవరం, అనకాపల్లి, భీమిలి ఎమ్మెల్యేగా వరుస విజయాల్ని సొంతం చేసుకున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు; వైకాపా, జనసేనల నుంచి కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయాలు, ఎన్నికల విషయాల్లో మంచి వ్యూహకర్తగా పేరుంది. తీవ్రమైన విషయాలనూ గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించి అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట. అత్యంత సన్నిహితంగా ఉండే వారితో పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేయిస్తుంటారు. గంటా తరఫున స్వచ్ఛందంగా పనిచేసే స్నేహితుల బలం, బలగం ఉంది. సొంత సామాజికవర్గ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం ఆయనకు కలిసొస్తున్న మరో అంశం. లోటుపాట్లు.. నియోజకవర్గంలో చతుర్ముఖ పోరు నెలకొంది. జనసేన అభ్యర్థిని పసుపులేటి ఉషాకిరణ్‌.. మంత్రి గంటా సామాజిక వర్గీయుల ఓట్లనే చీలుస్తారనే ప్రచారం సాగుతోంది. విష్ణుకుమార్‌రాజు 2014 ఎన్నికల్లో 12 రోజుల ముందు టికెట్‌ సంపాదించిన రాజు.. తెదేపా, జనసేన అండతో, వాక్పటిమతో జనాల్ని ఆకర్షించి విజయం సాధించారు. తనను కలవడానికి వచ్చేవారికి సంవత్సర కాలంగా అల్పాహారాలు, భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శాసనసభలో పలు సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారు. అయితే భాజపాపై నగరంలో తీవ్ర అసంతృప్తి ఉంది. వైకాపా అభ్యర్థి కె.కె.రాజుకు జగన్‌తో సన్నిహిత సంబంధాలుండడంతో ఆరు నెలల క్రితమే టికెట్‌పై స్పష్టమైన హామీ పొందారు. నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులై ఇప్పటికే మూడుసార్లు నియోజకవర్గంలోని అత్యధిక ఇళ్లకు వెళ్లి మద్దతు అభ్యర్థించారు. ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఆర్థికంగా స్థితిమంతుడైనా.. రాజకీయ అనుభవం లేదు. జనసేన అభ్యర్థిని పసుపులేటి ఉషాకిరణ్‌ ఎమ్మెస్సీ చదివి అధ్యాపకురాలిగా పనిచేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం వైకాపాలో చేరారు. ఆరు నెలల క్రితం జనసేనలోకి మారారు. సొంత సామాజికవర్గ ఓటర్లు, పార్టీ ఎంపీ అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉండడం, పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఎక్కువగా ఉండడం తనకు లాభించే అంశాలుగా భావిస్తున్నారు. తనకు ఓటేస్తే మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు.