Movies

ఓ మానసిక వికలాంగుడిలా కనిపించాలని ఉంది

brahmi interview after heart surgery

‘‘ప్రపంచంలో పది కోట్ల మంది తెలుగువాళ్లున్నారు. వాళ్లందరినీ ఏదో ఓ రోజు, ఏదో ఓ సందర్భంలో నవ్వించే ఉంటాను. ఆ చిరునవ్వులే నాకు దీవెనలు అయ్యాయి. అందుకే అనారోగ్యం నుంచి ఇంత త్వరగా కోలుకున్నా’’ అన్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఇటీవల ఆయన గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ మేకప్‌ వేసుకుని కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం ప్రత్యేకంగా ముచ్చటించారు.
*అసలేమైంది?
‘‘నాకు నిజంగా అనారోగ్యం అనేదే తెలీదు. ముప్ఫై మూడేళ్ల కెరీర్‌లో ఏనాడూ ఆరోగ్యం బాగోలేక షూటింగులకు దూరం కాలేదు. ఆ మధ్య గుండెలో కాస్త నొప్పిగా అనిపించింది. గ్యాస్ట్రిక్‌ సమస్య అనుకున్నాను. వైద్యులూ అదే చెప్పారు. ఎందుకైనా మంచిదని కొన్ని పరీక్షలు చేసి ‘స్టంట్‌ వేయాల్సిన అవసరం రావొచ్చు’ అన్నారు. ముంబయి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. అందుకే షూటింగులకు విరామం ఇచ్చి, కుటుంబంతో సహా ముంబయి వెళ్లాను. ఆపరేషన్‌ చేయించుకుని వచ్చా’’.
*ఇప్పుడెలా ఉంది?
‘‘ఏదైనా సానుకూల దృక్పథంతో ఆలోచించడం నా అలవాటు. అనారోగ్యం వల్ల కొన్ని గొప్ప విషయాలు తెలిశాయి. నన్ను తెలుగు ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో అర్థమైంది. ఎక్కడ కనిపించినా జాగ్రత్తలు చెబుతున్నారు. వందల, వేల పరామర్శలు. వాళ్లందరి దీవెనల వల్లే ఇప్పుడిలా ఉన్నానేమో. అసలు ఎవరు బ్రహ్మానందం? వాళ్లకు నేను ఏమవుతాను? నేనేమిచ్చాను? కేవలం కొన్ని నవ్వులు. అవన్నీ గుర్తు పెట్టుకుని నా గురించి పూజలు చేశారంటే ఇంకేం కావాలి? నేనింకా ఏం సాధించాలి. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను’’.
*సినిమాల మాటేంటి?
‘‘నా అనారోగ్యం నా అజ్ఞానాన్ని కూడా తొలగించింది. ఇది వరకు ‘ఇన్ని సినిమాలు చేశాం కదా? ఇంకా ఈ తాపత్రయం ఎందుకు?’ అనుకునేవాణ్ని. కొన్ని పాత్రలు నచ్చకపోతే.. పారితోషికం ఎక్కువ అడిగి భయపెట్టేసేవాణ్ని. ఇప్పుడు మాత్రం నా ఆలోచనా ధోరణి మారింది. నా నుంచి నవ్వుల్ని కోరుకుంటున్న వాళ్లందరికీ.. నేను నవ్వుల్ని పంచుతూనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటా. నాలోని నటుడికి ఏనాడూ రిటైర్‌మెంట్‌ ఇవ్వదలచుకోలేదు’’.
*హీరోగా చేస్తున్నారట..
‘‘అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో హీరోగా నటించాను. కానీ నన్ను నేనెప్పుడూ హీరోగా చూసుకోలేదు. హాస్య పాత్రలకంటే కొన్ని డబ్బులు ఎక్కువ ఇస్తారని అలాంటి కథలు ఒప్పుకున్నాను. ఈమధ్య రచయిత శ్రీధర్‌ సిపాన ఓ కథ తీసుకొచ్చాడు. ‘ఇందులో మీరే హీరో’ అన్నాడు. ‘రేసు గుర్రం’లో కిల్‌బిల్‌ పాండే టైపులో ఉండే పాత్ర అది. నేను నవ్వను.. సీరియస్‌గా ఉంటాను. ప్రేక్షకులు మాత్రం పగలబడి నవ్వుతుంటారు. నాకైతే ఎప్పుడెప్పుడు సెట్స్‌లోకి వెళ్దామా అనిపిస్తోంది’’.
*కలల పాత్ర ఏదైనా..
‘‘ప్రతి ఒక్కరికీ కొన్ని కలల పాత్రలుంటాయి. నాకు ఓ మానసిక వికలాంగుడిలా కనిపించాలని ఉంది. ఊర్లలో అలాంటి వాళ్లని చూస్తుంటాం. మా చిన్నబ్బాయికి ఇదే విషయం చెప్పా. ‘నువ్వు డైరెక్ట్‌ చేయ్‌.. నేను నటిస్తా’ అన్నాను. ఏం జరుగుతుందో చూడాలి’’.