Devotional

అక్షరాభ్యాసం పండుగ నాడు చేస్తే చాలా మంచిది

aksharaabhyaasam is good on festivals

* పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.
* సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ, దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు.
* మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.
* ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది.
* విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం.