దేశంలో జనాభా… శాసనసభ స్థానాల పరంగా చిన్నరాష్ట్రం సిక్కిం. ఈ బుల్లి రాష్ట్రంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో ఈ నెల 11న జరగనున్నాయి. పాతికేళ్లుగా ఎదురులేని పాలన సాగిస్తున్న పవన్‌కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌డీఎఫ్)కి ఈసారి ప్రతిపక్ష సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియా స్థాపించిన హమ్రో సిక్కింపార్టీ (హెచ్ఎస్‌పీ) తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కాంగ్రెస్, భాజపా ఖాతా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీలు డబ్బు పంపిణీకి తెరదీస్తున్నాయి. ఓటర్లకు భారీ మొత్తాలు ఇవ్వజూపుతున్నాయి. హిమాలయ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కింలో వరుసగా 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎస్‌డీఎఫ్ తిరుగులేని విజయాలు సాధించింది. పాతికేళ్లుగా చామ్లింగే ముఖ్యమంత్రి. చైనా, భూటాన్, నేపాల్‌లతో సరిహద్దు ఉండడంతో భద్రతా కారణాల రీత్యా ఇక్కడ మౌలిక వసతులకు కేంద్రం భారీగా నిధులిస్తుంది. పర్వత ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా పర్యాటక ఆదాయం మెండు. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు, పూర్తిగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల రాష్ట్రంగా మార్చడం, ప్లాస్టిక్ నిషేధం, చామ్లింగ్‌కు ఉన్న ఆకర్షణ ఎస్‌డీఎఫ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ‘‘పాతికేళ్లుగా రాష్ట్రంలో సుస్థిరపాలన అందిస్తున్నారు. చిన్నరాష్ట్రంలో ముఖ్యమంత్రి సరిగా లేకపోతే ఇబ్బందులొస్తాయి. అందుకే మేమంతా చామ్లింగ్ వైపే’’ అని ఖరగ్ బహదూర్ అనే చిరువ్యాపారి అన్నారు. రాష్ట్రంలో మార్పునకు సమయం ఆసన్నమైందని, ఎస్‌డీఎఫ్ పాలనతో ప్రజలు విసిగిపోయారని మోనోలెమ్ లెప్చా అనే యువకుడు అన్నారు. నిరుద్యోగం ఎస్‌డీఎఫ్‌కు ప్రతికూల అంశంగా ఉంది. చామ్లింగ్ మంత్రివర్గంలో పనిచేసిన ప్రేమ్‌సింగ్ తమాంగ్ (గోలే) 2013లో ఎస్‌కేఎంను స్థాపించారు. 2009లో మొత్తం క్లీన్‌స్వీప్ చేసిన ఎస్‌డీఎఫ్‌కు 2014లో ఎస్‌కేఎం నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆ ఎన్నికల్లో ఎస్‌కేఎం 40% ఓట్లతో 10 స్థానాలు గెలుచుకుంది. ఈసారీ ఎస్‌డీఎఫ్‌కు సవాలుగా మారింది. చామ్లింగ్ వ్యతిరేకులు, కొందరు ఎస్‌డీఎఫ్ నాయకులు ఎస్‌కేఎం గూటికి చేరడంతో బలం పుంజుకుంది. చామ్లింగ్ సమర్థుడే అయినా మార్పు కోసం ఎస్‌కేఎంకే మద్దతిస్తున్నామని ప్రైవేటు ఉద్యోగిని నొర్కిలా వాంగ్‌ఛుక్ తెలిపారు. అవినీతి కేసులో ఏడాది జైలుశిక్ష పడడంతో గోలేకు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు.
సిక్కిం పగ్గాలు ఎవరికి?

Related tags :