Politics

తమిళనాట తంబీల మధ్య తీవ్రపోరు

tamilnadu 2019 elections

తమిళనాడు రాజధాని చెన్నైలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా.. నేనా.. అన్నట్టు ఉంది. రాజధానిపై తొలినుంచి డీఎంకేకు పట్టు ఉంది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లో మూడు చెన్నై నగరంలో ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభంజనంతో ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నై, మధ్య చెన్నై నియోజకవర్గాలన్నీ ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. ప్రస్తుతం ఒక్క దక్షిణ చెన్నైలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ప్రత్యక్ష పోటీ ఉండగా, రెండు స్థానాల్లో డీఎంకే.. అన్నాడీఎంకే మిత్రపక్షాలతో తలపడుతోంది. డీఎంకే ముఖ్య నేత దయానిధి మారన్‌ మధ్య చెన్నై నుంచి బరిలో ఉన్నారు. మరో కీలక నేత టీఆర్‌ బాలు చెన్నై శివారులోని శ్రీపెరంబుదూరు నుంచి పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు డీఎంకేకు ప్రతిష్ఠాత్మకం.అన్నాడీఎంకే ఎంపీలు ఈ ఐదేళ్లలో ఏం సాధించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఎన్నికల ప్రణాళిక ప్రకారం చెన్నై నియోజకవర్గాల పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తాం. – డీఎంకేమోదీ ప్రభుత్వ విజయాలను చూడండి. అమ్మ లేని కుటుంబాన్ని ఆదుకోండి. పార్టీ అభ్యర్థులను గెలిపించండి. నిరుపేదలకు ఇళ్లు నిర్మిస్తాం. స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం. – అన్నాడీఎంకే
*****మధ్య చెన్నై
ఇక్కడ పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు సినీ నేపథ్యం ఉంది. డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్‌ కరుణానిధి కుటుంబసభ్యుడు కాగా పీఎంకే అభ్యర్థి శ్యామ్‌పాల్‌ కొన్ని చిత్రాల్లో చిన్నపాత్రలు పోషించారు. కమల్‌హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం నుంచి పోటీ చేస్తున్న కమీలా నాజర్‌ ప్రముఖ నటుడు నాజర్‌ సతీమణి. సుమారు 3 లక్షల ముస్లిం ఓట్లపై అన్నాడీఎంకే-భాజపా కూటమి మినహా అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. దినకరన్‌ ఈ స్థానాన్ని సోషలిస్ట్‌ డెమోక్రటిక్‌ పార్టీకి కేటాయించగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు తెహ్లాన్‌ బాగవి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మురసొలి మారన్‌ మూడు సార్లు, ఆయన కుమారుడు దయానిధి మారన్‌ రెండు సార్లు గెలిచారు.
**సమస్యలు
సెంట్రల్‌, అన్నానగర్‌, ఎగ్మూరు, ప్యారిస్‌కార్నర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. హార్బర్‌-మదురవాయల్‌ వంతెన పనులు అటకెక్కాయి. కూవం నది తీరంలో ఆక్రమణలు.
* 1977 నుంచి ఈ స్థానానికి 11 సార్లు ఎన్నికలు జరగగా డీఏంకే ఏడు సార్లు, ఒక సారి అన్నాడీఎంకే, మిగిలిన సార్లు కూటమి అభ్యర్థులు గెలుపొందారు.
****దక్షిణ చెన్నై
గతంలో ఈ స్థానం నుంచి డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, టీటీ కృష్ణమాచారి, మాజీ రాష్ట్రపతి వెంకట్రామన్‌, అలనాటి తార వైజయంతి మాలాబాలి వంటి మహామహులు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ప్రధాన పార్టీల నుంచి విద్యాధికులే పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి సిట్టింగ్‌ ఎంపీ జయవర్థన్‌ బరిలో ఉన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్‌ కుమారుడితను. ఎంబీబీఎస్‌ చదివిన జయవర్థన్‌ 2014లో 26 ఏళ్ల వయసులో ఎంపీ అయ్యారు. డీఎంకే అభ్యర్థి సుమతి అలియాస్‌ తమిళచ్చి తంగపాండియన్‌.. రాష్ట్ర మాజీ మంత్రి తంగపాండియన్‌ కుమార్తె. ఆంగ్ల సాహిత్యంలో పీజీ పట్టభద్రురాలు. ఆమె భర్త చంద్రశేఖర్‌ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి. ఏఎంఎంకే అభ్యర్థిగా రాష్ట్ర న్యాయశాఖ మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య, ఎంఎన్‌ఎం నుంచి విశ్రాంత ఐఏఎస్‌ రంగరాజన్‌ పోటీ చేస్తున్నారు.
**సమస్యలు
పళ్లికరణైలో రోజూ సుమారు 2,400 మెట్రిక్‌ టన్నుల చెత్త డంప్‌ చేస్తున్నారు. వర్షాలకు ఈ చెత్తతో కలిసే నీరు సమీపంలోని తాగునీటి వనరుల్లో కలుస్తూ, భూగర్భంలోకి ఇంకుతుండటంతో స్థానికులు దశాబ్దాలుగా బాధపడుతున్నారు.
* 1957 నుంచి 15 సార్లు జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఏడుసార్లు, కాంగ్రెస్‌ ఐదు, అన్నాడీఎంకే మూడు సార్లు గెలిచాయి.
****ఉత్తర చెన్నై
డీఎంకే ఈ స్థానంలో సునాయాసంగా గెలవొచ్చని భావిస్తోంది. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి విజయానికి కృషి చేసిన వెట్రివేల్‌ ప్రస్తుతం ఏఎంఎంకేలో ఉండటం, అదే నియోజకవర్గంలో ప్రాధాన్యం ఉన్న అన్నాడీఎంకే నేత శేఖర్‌బాబు డీఎంకేలోకి రావడం అనుకూలిస్తాయని అంచనా. అయినా పోటీలో రాజీ లేకుండా బలమైన అభ్యర్థి కళానిధి వీరాస్వామిని బరిలోకి దించింది. ఈయన మాజీ మంత్రి ఆర్కాడు వీరాస్వామి కుమారుడు. ప్రముఖ ఆస్పత్రుల్లో ప్లాస్టిక్‌ సర్జన్‌గా పనిచేశారు. డీఎంకే వైద్య విభాగంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆయనకు పోటీ చేసే అవకాశం లభించింది. డీఎండీకే అభ్యర్థిగా అళగాపురం ఆర్‌.మోహన్‌ రాజ్‌, ఎంఎన్‌ఎం నుంచి విశ్రాంత పోలీసు ఐజీ ఏజీ మౌర్య బరిలో ఉన్నారు.
సమస్యలుట్రాఫిక్‌ సమస్య వేధిస్తోంది. కాశిమేడు ఫిషింగ్‌ హార్బరు విస్తరణ కోసం జాలర్ల కుటుంబాలను తరలించడంపై అసంతృప్తి ఉంది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
* 1957 నుంచి డీఎంకే పది సార్లు, అన్నాడీఎంకే ఒక సారి, మూడు సార్లు కాంగ్రెస్‌, ఓసారి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
****శ్రీపెరుంబుదూరు
చెన్నై పొరుగున కాంచీపురం జిల్లాలో శ్రీపెరుంబుదూరు ఉంటుంది. ఈ లోక్‌సభా స్థానంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో మూడు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నాయి. ఈ స్థానం చెన్నైలోనే ఉన్నట్టు పార్టీల లెక్క. డీఎంకే కేంద్ర మాజీ మంత్రి, పార్టీ ముఖ్య నేత టీఆర్‌ బాలుని రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే వన్నియరు సామాజికవర్గానికి చెందిన డాక్టర్‌ ఎ.వైద్యలింగం పీఎంకే తరపున(అన్నాడీఎంకే కూటమి) పోటీ చేస్తున్నారు. ఏఎంఎంకే కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారాయణన్‌ను నిలిపింది.
**సమస్యలు
పారిశ్రామిక ప్రాంతమైన శ్రీపెరుంబుదూరులో ఇటీవల కాలంలో కార్మికుల తొలగింపు ఆందోళనలకు కారణమవుతోంది. చెన్నై నుంచి దక్షిణ, పశ్చిమ జిల్లాలకు వెళ్లేందుకు మదురవాయల్‌ ప్రధాన ప్రాంతమవడంతో వాహన రద్దీ నెలకొంది. దీనికోసమే 2009లో మదురవాయల్‌-హార్బర్‌ ఎలివేటెడ్‌ రోడ్డు ప్రాజెక్టు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు సగం కూడా పూర్తికాలేదు.
* ఇప్పటివరకు డీఎంకే 8, అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ 3 సార్లు వంతున గెలిచాయి.
**కనిపించని సందడి
ఎన్నికలు ఈనెల 18న జరగబోతున్నా.. నేటికీ ప్రచార హంగామా కనిపించడం లేదు. ఎండల ధాటికి ఉదయం, సాయంత్రం ప్రచారం పరిమితంగా చేస్తున్నారు. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందే అసలైనవి జరుగుతాయని నగరం పరిధి కీల్పాక్‌లోని టీ దుకాణ యజమాని సెల్వకుమార్‌ అన్నారు. ఓటు వేయాలని ఇప్పటివరకు పార్టీల నుంచి నేరుగా విజ్ఞప్తులు రాలేదని పెరుంబుదూరు బస్టాండు వద్ద 60 ఏళ్ల మురుగన్‌ పేర్కొన్నారు. జయలలిత, కరుణానిధి లేకపోవడంతో ఎన్నికల హడావుడి లేదని ట్రిప్లికేన్‌లోని వస్త్ర దుకాణ యజమాని కృష్ణన్‌ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌ పార్టీ(ఏఎంఎంకే) అభ్యర్థులు ప్రధానంగా అన్నాడీఎంకే ఓట్లు చీల్చే అవకాశం ఉందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా యువకులు తిరుగుతున్నారు. చిన్న కాలనీల్లో మాత్రమే ప్రచార వాహనాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ ద్వారా తమ ఓటుబ్యాంకు శాతాన్ని తెలుసుకోవాలనే అంచనాలతో కమల్‌హాసన్‌ ఉన్నారని చెబుతున్నారు.