Editorials

తిరువూరులో గెలుపెవరిదో?-TNI ప్రత్యేకం

who will win tiruvuru mla seat in 2019 elections

షెడ్యూల్ కులాలకు రిజర్వు అయిన కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఈసారి జరిగిన ఎన్నికల పోరులో వచ్చే ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. 86శాతానికి పైగా ఓటర్లు రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్‌లో పాల్గొన్నారు. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు స్థానం నుండి తెలుగుదేశం పార్టీ పరాజయం పాలవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఈసారి భారీ ఏర్పాట్లు చేసుకుంది. ప్రచారం చేయటానికి కేవలం ఒకరోజు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా చంద్రబాబు తిరువూరుకు తీసుకువచ్చారు. చంద్రబాబు సభకు హాజరైన ప్రజలను చూసి ఈ పర్యాయం తిరువూరులో తెలుగుదేశం విజయం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ధీమాతో ఉన్నాయి. కొవ్వూరు నుండి కాస్త ఆలస్యంగా తిరువూరు ఎన్నికల బరిలో తెదేపా అభ్యర్థిగా ప్రవేశించిన ఎక్సైజ్ మంత్రి కే.ఎస్.జవహర్ శక్తి వంచన లేకుండా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే తెలుగుదేశం సీనియర్ నేతల నుండి జవహర్‌కు పూర్తి స్థాయి సహాయ సహకారాలు లభించలేదని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ, రుణాల రద్దు వంటి పథకాలు తమకు బాగా కలిసి వచ్చాయని మహిళలు పెద్దఎత్తున తమకే ఓటు వేశారని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి.

*** వైకాపాలో అనందం
ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణనిధి మళ్లీ ఈ ఎన్నికల్లో తానే విజయం సాధిస్తారని ధీమాగా ఉన్నారు. ఈ పర్యాయం తెలుగుదేశం నాయకులూ, కార్యకర్తలు కన్నా వైకాపా నాయకులూ, కార్యకర్తలే ప్రచారంలో కొంత ముందంజలో ఉన్నారు. దీనికి తోడు రక్షణనిధి నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ఇంటిని సందర్శించారు. అవినీతి మచ్చలేని మంచి వ్యక్తిగా, స్నేహశీలిగా రక్షణనిధికి స్థానికంగా పేరుంది. వైకాపా ఈ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీలోనూ తెదేపా కన్నా ముందంజలో ఉంది. వైకాపా డబ్బులు తాము అనుకున్న ఓటర్లందరికి పంచగలిగామని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మంత్రి జవహర్‌కు కొవ్వూరులో లభించిన వ్యతిరేకత, స్థానిక తెలుగుదేశం నాయకులపై ఉన్న అసంతృప్తి, తిరువూరు మున్సిపాల్టీలో జరిగిన కుంభకోణాలు తమకు బాగా కలిసి వచ్చాయని వైకాపా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని వారు ధీమాతో ఉన్నారు. భారీగా పందేలు కాయటానికి వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం వర్గాలు ముందుకు వస్తే కోట్లాది రూపాయలు తిరువూరు ఎన్నికల ఫలితంపై కాసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇంకా 40 రోజుల పాటు ఎన్నికల ఫలితం కోసం వేచి ఉండాలంటే రెండు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర నిరాశగా ఉంది. టెన్షన్ పెరిగిపోతుందని వారు వాపోతున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.