Politics

తీవ్ర పోరులో హేమామాలిని

hemamalini has strong opponents

బాలీవుడ్‌ అభిమానులకు డ్రీమ్‌గర్ల్‌ గా సుపరిచితురాలైన హేమా మాలినికి రెండోసారి కూడా మథుర ఓటర్లు మధురమైన కానుకనిస్తారా? లేదా స్థానికేతరురాలిగా ముద్రపడి, తమకు దూరమైనందుకు ఓట్ల వాత పెడతారా? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. దిల్లీ-ఆగ్రా మార్గంలో ఉండడం, భాజపా తరఫున సినీ ప్రముఖురాలు పోటీ చేస్తుండడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేకమంది దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. యూపీలోని ఇతర నియోజకవర్గాల మాదిరిగానే ఇక్కడా సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. తమ అభ్యర్థిపై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నా, ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం ముందు అది కొట్టుకుపోతుందని భాజపా వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
***ఐదుసార్లు భాజపాకే పట్టం
శ్రీకృష్ణుడి జన్మ స్థలమైన మథురలో ఇప్పటి వరకు ఐదుసార్లు భాజపా అభ్యర్థులు నెగ్గారు. మొదట్లో స్వతంత్రులకు, తర్వాత కాంగ్రెస్‌, భారతీయ లోక్‌దళ్‌ (బీఎల్‌డీ), జనతా, జనతాదళ్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) పార్టీలకు పట్టం కట్టిన ఓటర్లు 1991, 96, 98, 99, 2014 ఎన్నికల్లో మాత్రం కమలానికే జై కొట్టారు. దీంతో ఈసారి విజయంపై ప్రధాన పక్షాలన్నింటిలో గట్టి విశ్వాసం కనిపిస్తోంది. భాజపా నుంచి హేమామాలిని పోటీ చేస్తుండగా మహేశ్‌ పాఠక్‌ (కాంగ్రెస్‌), కున్వర్‌ నరేంద్రసింగ్‌ (ఆర్‌ఎల్‌డీ)లు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు.
**విమర్శలకు దీటుగా సమాధానం
హేమా మాలిని టికెట్‌ ఖరారైన వెంటనే మథురపై మరింతగా దృష్టి కేంద్రీకరించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో నియోజకవర్గానికి చేరుకుని నేరుగా గోధుమ పొలాలకు వెళ్లారు. మహిళా రైతులతో కలిసి కొడవలి చేతపట్టారు. ట్రాక్టర్‌ నడిపారు. స్థానికులతో మమేకమవుతున్నానని చాటే ప్రయత్నం చేశారు.
* ఆమె నటించిన ‘షోలే’ చిత్రంలో ‘…యే బసంతీ కీ ఇజ్జత్‌ కా సవాల్‌ హై’ అనే డైలాగ్‌ అప్పట్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. గెలుపు సాధించడం తన ప్రతిష్ఠకు సవాల్‌ అని గతంలో ఎన్నికల బహిరంగ సభల్లో ఆమె ఈ డైలాగ్‌ వినిపించి, అలరించారు.
* నామినేషన్‌ వేసిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తూ పవిత్ర నగరంతో తనకు దైవికమైన బంధం ఉందని చెప్పారు.
* నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శల్ని తిప్పికొడుతూ…. గత అయిదేళ్లలో తాను 250 సార్లు ఇక్కడకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎంపీగానే కాకుండా నటిగా, నృత్యకారిణిగా తాను ఉన్నానని, 24 గంటలూ మథురలోనే ఉండాల్సిన అవసరం లేదని లౌక్యంగా సమాధానం ఇస్తున్నారామె.
* నగరం మొత్తాన్ని తాను అభివృద్ధి చేయలేకపోయినా, చేపట్టిన వాటిని మాత్రం చిత్తశుద్ధితో చేశానని, ఇకపైనా అలాగే చేస్తానని భరోసా ఇస్తున్నారు.
**ప్రభావం చూపే అంశాలు
* 2017 శాసనసభ ఎన్నికల్లో మథుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ స్థానాలకు గానూ నాలుగుచోట్ల భాజపా అభ్యర్థులే నెగ్గారు.
* ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి కున్వర్‌ నరేంద్రసింగ్‌కు రాజ్‌పుత్‌లలో మంచి పట్టు ఉంది. ప్రచారంలోనూ ముందున్న ఆయన ఆ వర్గం ఓట్లను బాగానే చీల్చే అవకాశం ఉంది.
* హేమా మాలిని స్థానికంగా అందుబాటులో లేకపోవడం. ముంబయిలో నివాసం ఉంటూ ఎన్నికల సమయంలోనే వస్తుంటారనే విమర్శలు. 2014 ఎన్నికల తర్వాత నియోకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఒక్కసారైనా అడుగుపెట్టకపోవడం.
* యమునా నది శుద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, బృందావనంలో కోతుల బెడద నిర్మూలన వంటివైనా ఐదేళ్లలో చేపట్టలేకపోవడం.
బలమైన వర్గాలు
జాట్లు 4.5 లక్షలు
జాతవ్‌లు 3 లక్షలు
ఠాకుర్లు 2.5 లక్షలు
ముస్లింలు 2 లక్షలు
**భాజపా ఓట్లు ఇలా పెరిగాయి…
1999 39.65%
2014 53.36%
2014లో హేమామాలిని ఆధిక్యం: 3,30,743
పోలింగ్‌: 18న