DailyDose

నేడు గౌతు లచ్చన్న వర్థంతి

sardar gauthu lacchanna death anniversary

తెలుగువారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు సర్థార్ గౌతు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, ఆచార్య రంగా ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న. సర్థార్ గౌతు లచ్చన్న (ఆగష్టు 16, 1909 – ఏప్రిల్ 19, 2006) భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్[1], జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. ప్రకాశం పంతులు మరియు బెజవాడ గొపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులుతో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. తెలంగాణా కొరకు మర్రి చెన్నారెడ్డితో చేతులు కలిపాడు. తెలంగాణా రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. చౌదరి చరణ్ సింగ్, జయప్రకాష్ నారాయణ, మసాని లతో పనిచేశాడు. 1950లో ఆచార్య రంగా కృషి కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. 1953 అక్టోబరు 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావలసిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్రసంఘంలో కాంగ్రెస్ నుంచి నీలం సంజీవరెడ్డి, ప్రజా పార్టీ నుంచి తెన్నేటి విశ్వనాధం, కృషి కార్ లోక్ పార్టీనుంచి లచ్చన్న సభ్యులు. ప్రకాశం పంతులు మంత్రివర్గంలోనూ, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ, లచ్చన్న మంత్రిగా పనిచేశాడు. 1961లో రాజాజీ స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖకు సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడు. 1978లో లచ్చన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. పభ్లిక్ అక్కౌంట్స్ ఛైర్మన్ గా ఆ రోజుల్లో పనిచేశాడు. కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చాడు. మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు సర్దార్ వల్లభభాయి పటేల్. మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. ఒకరిది దేశస్ధాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్ అంటే సేనాని. స్వాతంత్ర్యోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిది. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19 న కన్ను మూశాడు.