Politics

అన్నయ్య చెప్తే మోడీ మీద పోటీ చేస్తా

priyanka gandhi waiting on rahuls signal to contest from varanasi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోటీగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ఆదివారం ప్రియాంక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆమె ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ… ‘కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ‌ ఆదేశిస్తే వారణాసి నుంచి నేను సంతోషంగా పోటీ చేస్తాను’ అని ప్రకటించారు. ఆమె కొన్ని రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తమ పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన అజయ్‌ రాయ్‌ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మోదీ ఘన విజయం సాధించారు. ఆయన మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ-ఎస్పీ కూటమి తమ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించలేదు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీపై ప్రియాంకా గాంధీ గతంలోనూ స్పందిస్తూ తమ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని తెలిపారు. ఆమె ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయాలని చాలా మంది కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు.