Politics

అల్లా-ఆదిత్యా-అబ్దుల్లా-అనార్కలీ

ajamkhans son abdullah calls jayaprada anarkali

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్న సమాజ్‌ వాదీ పార్టీ (బీఎస్పీ) నేత అజాంఖాన్‌, భాజపా నేత జయప్రద మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జయప్రదపై అజాంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కుమారుడు అబ్దుల్లా అజాంఖాన్‌ కూడా ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అలీ, భజరంగబలీ ఇద్దరూ మనవాళ్లే. వారిద్దరూ మనకు కావాలి.. అయితే, మనకు అనార్కలీ మాత్రం వద్దు’ అంటూ ఆమెను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై జయప్రద స్పందిస్తూ తండ్రీకొడుకుల ప్రవర్తన ఒకేలా ఉందని విమర్శించారు. ‘వారు చేస్తున్న వ్యాఖ్యలకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదు. తండ్రీకొడుకుల ఇద్దరి తీరు ఇలాగే ఉంది. అబ్దుల్లా నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయని నేను ఊహించలేదు. ఆయన చదువుకున్న వ్యక్తి. ఆయన తండ్రి నన్ను అమ్రపాలీ అంటున్నారు.. అబ్దుల్లానేమో నన్ను అనార్కలీ అంటున్నారు. సమాజంలో మహిళలను మీరు ఏ తీరుతో చూస్తున్నారో ఇది తెలుపుతుంది. కాగా, ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, భాజపా నేత యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. ‘మీకు అలీ.. మాకు భజరంగబలీ’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను అనుకరిస్తూ అబ్దుల్లా జయప్రదపై ఈ వ్యాఖ్య చేశారు.