WorldWonders

స్కూటీ అమ్మాయిలు తెగ ఇబ్బందిపెడుతున్నారు

hyderabad female drivers causing lot of troubles to police

నిబంధనల్ని పక్కన పెట్టడంలో తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు యువతులు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిలో ఇటీవల మహిళలూ గణనీయంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశీలనలో వెల్లడవుతోంది. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో పురుషులకు దీటుగా మహిళలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో కొలువుదీరారు. ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 1000 ఐటీ సంస్థల్లో దాదాపు 5లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 30-40శాతం మంది మహిళా ఉద్యోగులుండటం విశేషం. కొలువుల్లో పురుషులతో పోటీ పడటం ఆహ్వానించదగ్గ అంశమే అయినా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల విషయంలోనూ హద్దులు దాటుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి పురుషులతో పోల్చితే మహిళలు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేది చాలా తక్కువ. కానీ ఇటీవలికాలంలో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడూ డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లోనూ అమ్మాయిలు చిక్కుతుండటం చర్చనీయాంశం అవుతోంది. ఇలా చిక్కిన సందర్భాల్లో ఎక్కువ సార్లు అమ్మాయిలు ట్రాఫిక్‌ సిబ్బందితో గొడవలు పడుతుండటం పరిపాటిగా మారుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి.. తదితర ప్రాంతాల్లో పబ్‌లు ఎక్కువగా ఉండటంతో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు అక్కడికి వెళ్తున్నారు. తిరుగు ప్రయాణాల్లో ట్రాఫిక్‌ పోలీసుల డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలకు చిక్కుతున్నారు. దీనికి తోడు శిరస్త్రాణాలు ధరించకపోవడం, నామఫలకాలు లేని వాహనాల్ని నడపడం, సిగ్నల్‌ జంపింగ్‌ చేయడం, స్టాప్‌ లైన్లను అతిక్రమించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. తీరా ట్రాఫిక్‌ పోలీసులకు దొరికితే మాత్రం బిక్కమొహం పెడుతున్నారు. ఎక్కడికక్కడే క్లిక్‌.. క్లిక్‌.. ఒకప్పుడైతే ట్రాఫిక్‌ ఉల్లంఘనలు పెద్దగా నమోదయ్యేవి కావు. ట్రాఫిక్‌ సిబ్బంది అరకొరగా ఉండటంతోపాటు ప్రధాన కూడళ్లు, రహదారులపై సీసీ కెమెరాలు అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారిపోయింది. ఒకప్పటిలా కాకుండా ప్రధాన కూడళ్లు, రహదారులపై ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటితో ఉల్లంఘనల్ని గుర్తించడం చిటికెలో పనిగా మారింది. ఎక్కువగా తోటి ప్రయాణికులే యూనిఫాం ధరించని ట్రాఫిక్‌ పోలీసుల అవతారమెత్తారు. తమతోపాటు ప్రయాణిస్తూ ఉల్లంఘనకు పాల్పడితే చాలు చరవాణికి పని చెబుతున్నారు. దీంతో మహిళా ప్రయాణికుల ఉల్లంఘనల శాతం క్రమేపీ ఎక్కువగా నమోదయ్యేందుకు ఆస్కారమేర్పడుతోంది.