Devotional

గోవిందరాజ స్వామి కిరీటాల దొంగ వీడే

ttd govindarajaswamy temple crown thief aakash patel

తిరుపతిలోని ప్రఖ్యాత గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారు కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సుమారు 80రోజుల పాటు విచారణ సాగినట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వెల్లడించారు. విచారణలో భాగంగా ఆలయంలోని మొత్తం 237 సీసీ కెమెరాలను పరిశీలించామని, ఓ వ్యక్తి దొంగతనం చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖాందార్‌కు చెందిన ఆకాశ్‌గా గుర్తించామని చెప్పారు. ఘటన జరిగిన రోజు ఉదయం ఆకాశ్‌ స్నేహితుడితో కలిసి ఆకాశ్‌ రేణిగుంట రైల్వేస్టేషన్‌కు వచ్చి, మిత్రుడ్ని మాత్రం చెన్నైకి పంపాడని వెల్లడించారు. కిరీటం చోరీ చేసిన తర్వాత రైలులో అతడు కాచిగూడ వెళ్లి, అక్కడి నుంచి నాందేడ్‌లోని ఖాందార్‌కు చేరుకున్నాడని వివరించారు. స్థానికంగా ఉన్న బంగారు వర్తకుల వద్ద కిరీటాలను కరిగించి రూపం మార్చేశాడని వివరించారు. నిందితుడి వద్ద దొంగిలించిన ఫోన్లు ఉండడంతో దొంగతనం సమయంలో వాటిని ఓ చోట దాచి ఉంచాడని, ఆ ఫోన్లను తీసుకొనేందుకు వచ్చిన క్రమంలో పక్కా సమాచారంతో మంగళవారం పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. అతని నుంచి 1300 గ్రాముల బంగారు కడ్డీలను సీజ్‌ చేశామని చెప్పారు. గతేడాది ఫిబ్రవరి 2న చోరీ జరిగిన నాటి నుంచి నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందంలోని పోలీసులు తీవ్రంగా శ్రమించారని, వారి కృషి అభినందనీయమని ఎస్పీ అన్నారు.