WorldWonders

రాజస్థాన్‌లో పెళ్లి చేసుకోవాలంటే శుభలేఖల్లో పుట్టినరోజు తప్పనిసరి

rajasthan governments creative way to tackle child marriages is by adding birthdays to wedding card

రాజస్థాన్‌లో బాల్య వివాహాలను అరికట్టేందుకు బుండీ జిల్లా యంత్రాంగం ఓ వినూత్న ఆలోచన చేసింది. పెళ్లి కుమారుడు, కుమార్తె తరపున ముద్రించే శుభలేఖల్లో వరుడు, వధువు పుట్టిన తేదీని తప్పనిసరిగా ప్రచురించాలని ప్రజలను జిల్లా అధికారులు కోరారు. అంతేకాకుండా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని శుభలేఖలో ఓ హెచ్చరికను కూడా ముద్రించాలని సూచించారు. రాజస్థాన్‌లో సాధారణంగా అక్షయ తృతీయ రోజున ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మే 7న వచ్చే అక్షయ తృతీయ రోజునుంచి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించారు. బాల్య వివాహాల్లో భారత్‌ ఆరో స్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, భూరికార్టుల ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన పలు బృందాలు తమ ప్రాంతంలో పెళ్లితో సంబంధమున్న కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. ఇంటికి రంగులు వేయడం, అమ్మాయిల అరచేతిపై గోరింటాకు పెట్టడం, పెళ్లి భాజాలు మోగించడం, అర్చకులు, వాహనాలను బుక్‌ చేయడం వంటి కార్యకలాపాలపై ఈ బృందాలు నిఘా పెట్టనున్నాయి. శుభలేఖల్లో పుట్టిన తేదీలతో పాటు హెచ్చరికను తప్పకుండా ముద్రించాలని జిల్లాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యాలకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.