ScienceAndTech

2022లో భారతదేశంలో విడుదల

samsung onyx cinema led to release in india in 2022

దేశంలో 2022 నాటికి 40 ఎల్‌ఈడీ సినిమా స్క్రీన్లు (ఓనిక్స్‌) విక్రయించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు శామ్‌సంగ్‌ ప్రకటించింది. సినిమా పరిశ్రమ ఆధునిక సాంకేతికతల వైపు విస్తరిస్తున్న తరుణంలో ఈ వ్యాపారం మంచి అవకాశంగా భావిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ‘2020కి 20 స్క్రీన్లు, 2022 నాటికి 40 ఓనిక్స్‌ తెరల్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామ’ని శామ్‌సంగ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు (కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌) పునీత్‌ సేథి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో సుమారు 10,000 స్క్రీన్లు సంప్రదాయ ప్రొజెక్టర్‌ సిస్టమ్‌తో పని చేస్తున్నాయి. వీటిని ఆధునిక ఎల్‌ఈడీ తెరలుగా మార్చాలన్నదే తమ ఉద్దేశమని శామ్‌సంగ్‌ వెల్లడించింది. శామ్‌సంగ్‌ మూడు విభాగాల్లో ఓనిక్స్‌ ఎల్‌ఈడీ సినిమా స్క్రీన్లను రూపొందిస్తోంది. 5, 10, 14 మీటర్ల పరిమాణంలో ఇవి లభ్యమవుతున్నాయి. ఎకోసిస్టమ్‌ సౌండ్‌, 14 మీటర్ల ఎల్‌ఈడీ తెరగా మార్చడానికి సుమారు రూ.5.6-6.3 కోట్లు ఖర్చవుతుందని సేథి తెలిపారు. ప్రస్తుతం పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపొలిస్‌ తమ నెట్‌వర్క్‌ థియేటర్లలో ఒక్కో ఓనిక్స్‌ తెరను నిర్వహిస్తున్నాయి. బెంగళూరులోని స్వాగత్‌ సినిమాస్‌లో గురువారం 14 మీటర్ల ఎల్‌ఈడీ తెరను ప్రారంభించారు. ఈ పరిమాణం తెరలను మలేసియా, చైనాల్లోనే ఇప్పటివరకు శామ్‌సంగ్‌ అమర్చింది.