Food

ఈ బియ్యాన్ని వండక్కర్లేదు

this assam magic rice boka saul needs no cooking

మామూలుగా అన్నం వండాలంటే బియ్యాన్ని కడిగి నీళ్లుపోసి స్టవ్‌పై ఉంచితే పదిహేను నుండి ఇరవై నిముషాల్లో అన్నం తయారవుతుంది. అదే కుక్కర్లలో అయితే బియ్యాన్ని కడిగి అందులో వేసి స్టవ్‌పై ఉంచితే పది నిముషాల్లో అన్నం రెడీ అవుతుంది. రైస్ కుక్కర్‌లు వచ్చిన తరువాత అన్నం వండే పని మరింత సులువైందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అసోంలో పండించే ఓ రకం బియ్యాన్ని మాత్రం వండకుండానే తినేయచ్చు. స్టవ్ కానీ, రైస్‌కుక్కర్లు అవసరం లేకుండా కేవలం నానబెట్టడంతోనే ఈ బియ్యం అన్నంలా మారుతుంది. బొకా ఛాల్‌గా పిలిచే ఈ బియ్యం ప్రత్యేకత ఇది. అందుకే ఈ బియ్యానికి ఇటీవల భౌగోళిక గుర్తింపు(జీఐ)ను ఇచ్చింది కేంద్రప్రభుత్వం. ఈ బియ్యం గురించి అందరికీ తెలియజేసి మార్కెట్‌ను పెంచాలనే ఉద్దేశంతో 2016లో లోటస్ ప్రొగ్రెసివ్ సెంటర్(ఎల్‌పీసీ), సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్(సీఈఈ) సంస్థలు బొకా ఛాల్‌కు భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన కేంద్రప్రభుత్వం ఇటీవల బొకా ఛాల్‌కు జీ ఐ గుర్తింపును ఇచ్చింది. అసోంలోని నల్బరీ, బార్పెటా, గోల్‌పరా, కామ్‌రూప్, ధుబ్రీ, చిరాంగ్, బస్కా, దరంగ్ తదితర ప్రాంతాల్లో ఈ బొకా ఛాల్ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. మొఘలులకాలంలో ఈ బియ్యాన్ని ఎక్కువగా సైన్యం కోసం పండించేవారట. తర్వాతి కాలంలో వీటిని రైతులు తినడం మొదలుపెట్టారు. జూన్-డిసెంబర్ మధ్య ఈ బియ్యాన్ని అసోం రైతులు పండిస్తారు. ఈ బియ్యాన్ని వండేందుకు స్టవ్‌కానీ, ఇంధనం కానీ అవసరం లేదు. కేవలం గంటపాటు చల్లటినీటిలో బియ్యాన్ని నానబెడితే అన్నం తయారైపోతుంది. నీటిలో నానడం వల్ల బియ్యం ఉబ్బి మెత్తగా మారిపోతాయి. వీటిని నేరుగా తినొచ్చు. అస్సాం రైతులైతే దీనిలో పెరుగు, బెల్లం, అరటిపండులను కలుపుకుని నేరుగా తినేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంటికి వచ్చిన అతిథులను ఈ బియ్యాన్ని నానబెట్టి అన్నంగా పెడతారు. అయితే ప్రస్తుతం రైతులు తమకోసం మాత్రమే ఈ బియ్యాన్ని పండించుకుంటున్నారు. బయటి వ్యక్తులకు వీటి గురించి తెలియకపోవడంతో మార్కెట్‌పరంగా అంత లాభదాయకం కాదేమో అని రైతులు భావిస్తున్నారు. ఈ బియ్యం గురించి తెలుసుకున్న లోటస్ ప్రొగ్రెసివ్ సెంటర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థలు దీనిపై పరిశోధనలు చేశాయి. ఈ సంస్థలే బొకా ఛాల్‌కు భౌగోళిక గుర్తింపు వచ్చేలా చేశాయి. ఈ బియ్యం ఆరోగ్యానికి ఎందో మంచిదని ఇటీవల గువాహటి యూనివర్శిటీ చేసిన అధ్యయనంలో తేలింది. ఇందులో 10.73 శాతం ఫైబర్, 6.8 శాతం ప్రొటీన్లు ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఈ బియ్యం మనిషి శరీరంలోని వేడిని తగ్గిస్తుందట. అంతేకాక ఈ బియ్యాన్ని రసాయనాలతో కూడిని క్రిమిసంహారక మందులతో పండించడం సాధ్యం కాదట. ఒకవేళ క్రిమిసంహారక మందులు వాడితే పంట మొత్తం నాశనమవుతుందని తమ పరిశీలనలో తేలిందని ఎన్జీవోలు చెబుతున్నాయి. బయో ఎరువులు మాత్రమే వినియోగించి రైతులు ఈ బియ్యాన్ని పండిస్తారు. వరదలు, ప్రకృతి బీభత్సాలు వంటి అత్యవసర సమయంలో ఈ బియ్యం ఎంతగానో ఉపయోగపడతాయని ఎన్జీవోలు చెబుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా ఆహారపదార్థాల కింద ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తే వరద ప్రభావిత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగానూ, అసోం రైతులకు లాభదాయకంగానూ ఉంటుందని చెబుతున్నారు.