విసర్జించిన మలమే మనం తాగుతున్న జలం. ఆంధ్రప్రదేశ్ జీవనదుల్లో కాలిఫోర్మ్ బ్యాక్టీరియా. అన్ని జీవనదులలో నీరూ “సీ“ గ్రేడ్. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు పరీక్షల్లో నిర్ధారణ. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి నదుల నీరు తనిఖీ. అన్ని నదుల్లోనూ పేరుకుపోయిన కాలిఫోర్మ్ బ్యాక్టీరియా. మానవ మల అవశేషాలతో నీరు పూర్తిగా కలుషితం. గలగల గోదారి పారుతుంటేను ..బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటేను..పాటల వరకే. ఈ జీవనదుల్లో జలం..మానవ మలంతో కలిసి గరళమై జనాల పాలిట ప్రాంణాంతకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, నాగావళి, వంశధార నదుల నుంచి సేకరించిన నీటి నమూనాలను సేకరించి..పరీక్షించింది. తాగునీటికి పనికొచ్చే నీటిని ఏ గ్రేడ్, బి గ్రేడ్‌గా పేర్కొంటారు. ఏ,బీ గ్రేడుల నీటిని శాస్ర్తీయ పద్ధతిలో శుద్ధి చేస్తే తాగేందుకు సురక్షితమైనవిగానే పరిగణిస్తారు. అయితే జీవనదుల్లో నీరు సీ గ్రేడ్ గా తేలింది. ఈ నీరు మామూలు శాస్ర్తీయ పద్ధతిలో శుద్ధి చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరమే అంటున్నారు. అయితే నదుల్లో లభ్యమవుతున్న ఈ నీటి శుద్ధి ఏ స్థాయిలో జరుగుతోందో మనకు తెలుసు. చూస్తున్నాం. నీటి నాణ్యత పరీక్షించేందుకు నదిలో ప్రతీ నెలా ఏదో ఒక ప్రాంతం నుంచి నీటి నమూనాను సేకరిస్తున్నారు. సీ గ్రేడ్ నీటిని అత్యంత నాణ్యమైన విధానంలో శుద్ధి చేస్తేగానీ తాగేందుకు పనికిరాదని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. దీనితరువాత డీ, ఈ గ్రేడ్ జలాలు మున్సిపాలిటీ డ్రైనేజీలు, పారిశ్రామికవ్యర్థజలాల వంటివన్నమాట. గోదావరి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే పోలవరం దగ్గర.. సముద్రంలో కలిసే ధవళేశ్వరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి శాంపిళ్లను సేకరించారు. కృష్ణా జలాల నుంచి శ్రీశైలం, సముద్రంలో కలిసే చోటు అయిన హంసలదీవితోపాటు అమరావతి ఏరియాలోనూ నది నుంచి శాంపిళ్లను సేకరించారు. వీటితోపాటు పెన్నా, తుంగభద్ర, నాగావళి, వంశధార నదుల నుంచి 2014 నుంచి క్రమం తప్పకుండా తీసుకుంటున్న శాంపిళ్లన్నీ కూడా “సీ“ గ్రేడ్ నీరుగానే తేలింది. మానవ, జంతు మలం పూర్తిగా నదుల జలాలలో కలిసిపోయింది. మనం విసర్జించిన మలమే..మనం తాగుతున్న జలం అంటే అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ పరీక్షల తేల్చిన సత్యం ఇదే. కాలిఫోమ్ బ్యాక్టీరియా అంటే మానవ మలం అవశేషాల్లోంచి వచ్చినవే. ఇవి మళ్లీ నీటి ద్వారా మనలోకి ప్రవేశించి డయేరియా, అజీర్తి, వాంతులు, కడుపునొప్పి,విష జ్వరం వంటి లక్షణాలకు కారణాలవుతున్నాయి. కాలిఫోమ్ బ్యాక్టీరియా గ్రూపుకు చెందినదే ఈ కోలి బ్యాక్టీరియా.
నది శాంపిల్ నీరు 2014 2019
గోదావరి 100 మి.లీ 90 mpn 1087 mpn
కృష్ణా 100 మి.లీ 892 mpn 1264 mpn