Devotional

రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

ramadan starts in india

– నెలవంక దర్శనంతో మార్మోగిన సైరన్లు
– ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు

రంజాన్‌…జీవితాన్ని…జీవిత గమనాన్ని పవిత్ర పరిచి మదిలోనే స్వర్గానుభూతిని కలిగించే మాసం. ఆలోచనలు, మాటలు, పనులు, నడతల్లో అల్లాహ్‌ ఆశించే విశాల మానవత్వం. పవిత్రత గోచరిస్తాయి. నెలవంక తొంగి చూడటంతో పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభంకానున్నాయి. సకల శుభాల మాసం రంజాన్‌ ప్రారంభమైంది. సోమవారం నెలవంక దర్శనంతో ముస్లింలు ఉపవాసాలకు సమాయత్తమయ్యారు. అల్లాహ్‌ నెలవంకను మా కోసం, శాంతి భద్రతల కోసం ఉదయింపజేయి..ఓ దేవుడా నీవు మెచ్చే పనులన్నీ చేసే భాగ్యాన్ని అనుగ్రహించు. ఓ నెలవంకా! నీ దేవుడు, మా దేవుడు, అందరి ప్రభువు అల్లాహ్‌ మాత్రమే’ అని ప్రార్థించి ముస్లింలు నెలవంకను వీక్షించారు. మసీదుల్లో ఇమామ్‌లు రంజాన్‌ మాసాన్ని ప్రకటించారు. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్‌ సోదరులు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రంజాన్‌ పవిత్ర మాసాన్ని ఆహ్వానించారు. ఉపవాస వ్రతాన్ని పాటించేందుకు కావాల్సిన నిత్యవసరాలను ముస్లింలు విరివిగా కొనుగోలు చేశారు. ఇఫ్తార్, సహర్‌ కోసం ముస్లింలు పెద్ద ఎత్తున ఖర్జూరం, పండ్లు కొనుగోలు చేశారు. పరమ పవిత్ర రంజాన్‌ మాసమంతా ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనల్లో నిమగ్నమవుతారు.. రోజూ సూర్యోస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం నమాజులు, సత్కార్యాలే కాదు.. విరివిగా దాన, ధర్మాలూ చేస్తారు. ఈ నెలలో చేసే ప్రతిపుణ్య కార్యానికీ, ఆ«రాధనకు డెబ్బై రెట్ల పుణ్యం దక్కుతుందని వారి విశ్వాసం. ఐదుసార్ల నమాజ్‌లతోæపాటు రాత్రి వేళల్లో ™ రావీహ్‌ ప్రార్థనలుంటాయి. ఆ సమయంలో రోజూ ఖురాన్‌ను పఠించి ధ్యానిస్తారు. ఇది ప్రవక్త సూచించిన సంప్రదాయం. 30 అధ్యాయాలున్న ఖురాన్‌ను నెలలోగా పఠించాలన్న ప్రవక్త ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటిస్తారు. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించి, సదా ఆచరించే దివ్య గ్రంధం ఖురాన్‌…ఈ మాసంలోనే అవతరించింది. ప్రవక్తలపై ఫర్మానాలు సైతం ఇదే నెలలో అవతరించాయి. అందుకే ఈ నెలకు అంత ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో సైతాను బందీ అవుతాడని..నరక ద్వారాలు మూతపడి స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. స్వర్గాన్ని చేరే అర్హతను సాధించే క్రమంలో…దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ మాసంలో ప్రారంభిస్తారు. అలా వారి జీవితం పవిత్ర ఆరాధన అవుతుంది. రంజాన్‌ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రోజంతా కఠోర ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు. రోజుకు ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజ్‌లు చేస్తారు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సహర్‌తో ఉపవాస దీక్షలను చేపడతారు. సూర్యస్తమయం అనంతరం ఇఫ్తార్‌ విందులు కొనసాగుతాయి. ఇఫ్తార్‌ విందులకు హిందువులను సైతం ఆహ్వానించి మతసామరస్యాన్ని చాటుకుంటారు. ఒకవైపు ఉపవాస దీక్షలు కొనసాగుతుండగానే…మరోవైపు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకర వస్తువులను ఖరీదు చేయడానికి షాపింగ్‌ చేస్తారు. వ్యాపార సంస్థలు సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులను డిస్కౌంట్లతో వినియోగదారులకు అందజేయడానికి సిద్ధమయ్యాయి. రంజాన్‌ మాసం మొదటి ఉపవాస దీక్ష మంగళవారం తెల్లవారుజామున 4.20 గంటలకు సహార్‌తో ప్రారంభమైంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి చారిత్రాత్మకమైన మక్కా మసీదులో ముస్లిం సోదరులు ఇషా నమాజ్‌ చేశారు. అనంతరం రాత్రి తరావీ సందర్భంగా ఖురాన్‌ పఠనం చేశారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించు కొని రాత్రి షాపింగ్‌ చేయడంతో వ్యాపార సముదాయాలన్ని రద్దీగా మారాయి. మంగళవారం సాయంత్రం 6.43 గంటలకు ఉపవాస దీక్షలు విరమించి ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు.