ScienceAndTech

మీ ముఖ కదలికలతో మీరూ కదలొచ్చు

Wheelie will move you based on your facial expressions

ఇప్పటి వరకూ సోలార్‌ పవర్‌, విండ్‌ పవర్‌ని వాడుతున్నాం. ఇకపై ‘ఫేస్‌ పవర్‌’ని వాడొచ్చు. అందేనండీ.. మీ ముఖ కవళికల్ని శక్తిగా మార్చేసి చక్రాల కుర్చీని కదలించొచ్చు. బ్రెజిల్‌కి చెందిన హూబాక్స్‌ రోబోటిక్స్‌ అంకురసంస్థ ఈ సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. ‘ఫేషియల్‌ రికగ్నిషన్‌’తో రూపుదిద్దుకున్న తొలి చక్రాల కుర్చీ ఇది. పేరు ‘వీలి’ (Wheelie) ముఖకవళికల్ని గుర్తించడం ద్వారా ఎటుకావాలంటే అటు కదులుతుంది. ఇంటెల్‌ ‘రియల్‌ సెన్స్‌’ ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని దీంట్లో వాడారు. కుర్చీకి అమర్చిన కెమెరా రియల్‌ సెన్స్‌ టెక్నాలజీని వాడుకుని వ్యక్తి ముఖ కవళికల్ని గుర్తిస్తుంది. పలు రకాల ఎక్స్‌ప్రెషన్స్‌ని కెమెరా రికార్డు చేసి ఒక్కో ఎక్స్‌ప్రెషన్‌కి ఒక్కో కమాండ్‌ని ఎసైన్‌ చేస్తుంది. ఉదాహరణకు ఓ చిరు నవ్వుతో కుర్చీని ముందుకు కదిలించొచ్చు. మూతిని పక్కకు తిప్పడం ద్వారా కుడి, ఎడమలకు వెళ్లొచ్చు. పెదాలు బిగించి బ్రేక్‌ వేయొచ్చు అన్నమాట. మోటార్‌తో పని చేసే చక్రాల కుర్చీ ఏదైనా… ‘వీలి7 కిట్‌’ని కేవలం 7 నిమిషాల్లో సెట్‌అప్‌ చేయొచ్చట. పక్షవాతం, గుండెపోటు లేదా మరేదైనా అనారోగ్య సమస్యలతో కాళ్లూ, చేతులూ చచ్చుబడిన వారికి ఈ కుర్చీ ఎంతో ఉపయోగకరం!