DailyDose

బెంగాల్ పర్యటనకు ఆంధ్రా టైగర్-ప్రధాన వార్తలు-05/08

Chandrababu campaigning in west bengal for mamata-today telugu top news

1. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు!
తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ్‌బంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధ, గురు వారాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం జార్గాం, హల్దియాల్లో.. ఎల్లుండి ఖరగ్‌పూర్‌, కోల్‌కతాలో ప్రచారంలో పాల్గొంటారు. తొలి దశలో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల సందర్భంగా విశాఖలో తెదేపా నిర్వహించిన ప్రచార సభకు  పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరై ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

2. ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి: కాంగ్రెస్‌
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలను తెలిపారు. అర్ధరాత్రి షెడ్యూల్‌ ఇచ్చి తెల్లవారు జామునుంచే నామినేషన్‌ స్వీకరించడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సీఈసీని కోరినట్టు ఆయన చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ ఫిర్యాదు నేపథ్యంలో అన్ని విషయాలూ పరిశీలిస్తామని సీఈసీ హామీ ఇచ్చిందని శ్రవణ్‌ తెలిపారు.

3. ఇంటర్‌ వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా
ఇంటర్ ఫలితాల వివాదంపై హైకోర్టులో విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది. గ్లోబరీనా సంస్థను కేసుల్లో ప్రతివాదులుగా చేర్చాలని బాలల హక్కుల సంఘం కోరింది. ఫలితాల రీవెరిఫికేషన్‌ కొనసాగుతోందని ఇంటర్‌ బోర్డు హైకోర్టుకు వివరించింది. అలాగే, రీవెరిఫికేషన్‌ పూర్తి వివరాల వెల్లడికి మరికొంత గడువు కోరింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. ఇంటర్‌ ఫలితాల్లో భారీగా తప్పులు దొర్లాయని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, విపక్షాలు ఇప్పటికే నిరసనకు దిగాయి. నిజనిర్ధారణ కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా నివేదికలో పలు సూచనలు చేసింది.

4. సినిమాటికెట్ల రేట్లపెంపుపై కోర్టులో పిటిషన్‌ వేస్తాం
సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా అనుమతివ్వలేదని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి మేరకు నిన్న థియేటర్ల యజమాన్యాలే టికెట్ల ధరలు పెంచినట్లు తమ దృష్టికొచ్చిందన్న తలసాని… సినిమా టికెట్ల ధరల పెంపుపై కోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. ఈ అంశంపై హోంశాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ, అధికారులతో చర్చించినట్లు చెప్పారు. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సామాన్యులు కూడా సినిమా చూడాలంటే టికెట్ల రేట్లు తక్కువగా ఉండాలని పేర్కొన్నారు.

5. జగ్గారెడ్డి అలా మాట్లాడటమేంటి?: విజయశాంతి
సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ కార్యకర్తల్లో అయోమయం సృష్టించేవిగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని,  కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే చంద్రబాబుతో పాటు కేసీఆర్‌, జగన్‌లు ఆ కూటమికి మద్దతిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెరాసతో అమీతుమీ తేల్చుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెబుతుంటే.. జగ్గారెడ్డి అలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

6. ‘దోచుకున్న వారిని ఈ చౌకీదార్‌ వదలడు’
ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హరియాణాలోని ఫతేహాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ‘తమ రక్షణ వ్యవస్థను శక్తిమంతం చేయకుండా ఏ దేశమైనా ప్రపంచ శక్తిగా ఎదగగలదా? కాంగ్రెస్‌ లేదా మహా కల్తీ కూటమి పార్టీలు తమ సమావేశాల్లో ఎప్పుడైనా రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడాయా? వారు రక్షణ వ్యవస్థ గురించి ఏమీ మాట్లాడలేరు. రైతులను దోచుకున్న వారిని ఈ చౌకీదార్‌ (కాపలాదారుడు) న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తున్నాడు. వారు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోసారి నన్ను ఆశీర్వదించండి’  అని మోదీ కోరారు.

7. ప్రియాంక సమయాన్ని వృథా చేస్తున్నారు
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాడుతున్న రాష్ట్రాల్లోనే ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘ఆమె సమయాన్ని వృథా చేస్తన్నారు. ఆమె రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎందుకు ప్రచారం చేయట్లేదు. ఆమె యూపీలో బీఎస్పీ-ఎస్పీలకు, దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భాజపాతో నేరుగా తమ పార్టీకి పోటీ ఉన్న రాష్ట్రాల్లో ఆ అన్నాచెల్లెళ్లు (రాహుల్‌ గాంధీ, ప్రియాంక) దృష్టి పెట్టట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

8. ‘మోదీ,షా ప్రసంగాలపై కలగజేసుకోలేం’
ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ప్రసంగాలకు క్లీన్‌ చిట్‌ ఇస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంలో కలగజేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. వారి ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ సుష్మితా దేవ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసే ఉద్దేశం కోర్టుకు లేదని తెలిపింది. గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లో వారిపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రమే పేర్కొన్నారన్నారు.

9. పాక్‌ చెరలో 34 మంది భారత మత్స్యకారులు
భారత్‌కు చెందిన 34 మంది మత్స్యకారులను పాక్‌ అదుపులోకి తీసుకుంది. తన అదుపులో ఉన్న 60 మందిని విడుదల చేసిన 10 రోజుల వ్యవధిలోనే పాక్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో మరో 34 మందిని అరెస్టు చేసింది. జనవరిలో గుజరాత్‌కు చెందిన ఐదుగురు పడవలు నడిపే వారిని నిర్బంధించిన పాక్‌.. ఏఫ్రిల్‌ 29న 55 మంది మత్స్యకారులు, ఐదుగురు పౌరులను విడుదల చేసింది. గతేడాది కరాచీలోని లంధీ, మాలిర్‌ జైళ్ల నుంచి మూడు విడతల్లో దాదాపు 250 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ విడుదల చేసింది.

10. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా
నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 138 పాయింట్లు నష్టపోయి 11,359 వద్ద, సెన్సెక్స్‌ 487 పాయింట్లు నష్టపోయి 37,789 వద్ద ముగిశాయి. వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు దాదాపు 3శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 1శాతం పడిపోయింది. మీడియా రంగం, స్థిరాస్థి, ఫార్మా, ప్రభుత్వ రంగబ్యాంక్‌ల షేర్లు భారీగా నష్టపోయాయి. నేడు నూజెన్‌ కెమికల్స్‌  షేర్లు మార్కెట్లో లిస్టయ్యాయి. దాదాపు 16శాతం ప్రీమియం వీటికి లభించింది. గత నెల 24 నుంచి 26 మధ్యలో ఈ సంస్థ ఐపీవో కొనసాగింది.