Agriculture

నిజామాబాద్ రైతుల ఎన్నికపై ఐఎస్‌బీ అధ్యయనం

election commissioner of india EC CEO Rajat Kumar Requests indian school of business ISB To Case Study On Nizamabad turmeric farmers mp member of parliament 2019 Election

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక నిర్వహణ తీరు మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠం కానుంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికపై అధ్యయనం చేయాలని హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ కోరారు. మేనేజ్‌మెంట్‌ రంగంలోని సప్లై-చైన్‌ అంశంలో ఓ కేస్‌స్టడీగా ఈ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయాలని లేఖలో వివరించారు. ఇందూరులో పోటీచేసిన వారిలో 178 మంది రైతులే. పసుపు, ఎర్రజోన్న పంటలకు గిట్టుబాటు ధర లభించడంలేదన్న విషయాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికను సవాల్‌గా తీసుకున్న ఈసీ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంలో సఫలమైంది. అత్యాధునిక ఈవీఎంలుగా గుర్తింపు పొందిన ఎం-3 రకం యంత్రాలను నిజామాబాద్‌లో వినియోగించారు. ఇప్పటి వరకు నోటాతో కలిపి 64 మంది బరిలో ఉంటే బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తూ వచ్చారు. నోటాతో కలిపి 383 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినా ఎన్నికను నిర్వహించేందుకు ఎం-3 యంత్రాలతో అవకాశం ఉంది. ఈ యంత్రాలను దేశంలో తొలిసారిగా నిజామాబాద్‌లో వినియోగించారు. ఎన్నిక నిర్వహణలో భాగంగా హెలికాప్టర్‌ను సైతం వినియోగించారు. ఈ ఎన్నిక నిర్వహణను గిన్నిస్‌బుక్‌లో నమోదు చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం కోరిన విషయం తెలిసిందే.