WorldWonders

ఈసీకీ రక్తలేఖ

Man in India writes letter with blood to election commission - rajiv gandhi and modi

ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి ఓ వ్యక్తి రక్తంతో రాసిన లేఖను ఎన్నికల సంఘానికి పంపించాడు. అమేథిలోని షాగర్‌కు చెందిన మనోజ్ కశ్యప్ ఈ లేఖను రాశాడు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది లేఖ రాసినట్లు పేర్కొన్నాడు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ అత్యంత అవినీతి పరుడు అని పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయన్నారు. ప్రధాని వ్యాఖ్యలు తనకెంతో బాధ కలిగించాయన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు, దేశంలో కంప్యూటర్ విప్లవానికి నాంది పలికిన వ్యక్తి రాజీవ్‌గాంధీ అని కొనియాడాడు. దివంగత మాజీ ప్రధాని వాజపేయి సైతం రాజీవ్‌ను మెచ్చుకున్న అంశాన్ని సైతం లేఖలో గుర్తుచేశాడు. రాజీవ్‌గాంధీని అవమానించే ఎవరినైనాసరే ఈ ప్రాంత ప్రజలు రాజీవ్‌ను హతమార్చిన వారిని చూసిన మాదిరిగానే చూస్తారన్నారు. దేశ ప్రజలు అదేవిధంగా అమేథి ప్రజల గుండెల్లో రాజీవ్ ఇంకా జీవించే ఉన్నాడన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రధానికి ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరాడు.