Sports

క్రికెట్ బంతికి ఆడా మగా తేడా ఉండదు

Smriti Mandhana On Gender In Cricket

మన దేశంలో క్రికెట్‌ అనగానే చాలామంది క్రికెట్‌ అభిమానులకు సచిన్‌, ధోనీ, కోహ్లీలాంటి క్రికెటర్లు గుర్తొస్తారు. వాళ్లతోపాటు మహిళలు కూడా క్రికెట్‌ ఆడుతున్నారన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. వాళ్ల మ్యాచ్‌లు చూడటానికి అంతగా ఆసక్తి చూపించరు. ఇద్దరి ముగ్గురు మినహా ఎక్కువ మంది మహిళా క్రికెటర్ల పేర్లు చాలామందికి తెలియవు. ఎప్పుడైనా మిథాలీ రాజ్‌, స్మృతీ మంధానలాంటి వాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడితే తప్ప వాళ్ల పేర్లు టీవీలు, పత్రికల్లో సైతం పెద్దగా కనిపించవు. అయితే, ఈ మధ్య కాలంలో మహిళా క్రికెట్‌ను వెలుగులోకి తెచ్చేందుకు బీసీసీఐ సైతం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఐపీఎల్‌కు దీటుగా ప్రస్తుతం టీ20 ఛాలెంజ్‌ పేరుతో మహిళలకు టోర్నీ నిర్వహిస్తోంది. తొలి మ్యాచ్‌లోనే 90 పరుగులతో ఆదరగొట్టిన స్మృతీ మంధాన మహిళల క్రికెట్‌ గురించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘క్రికెట్‌లో ఫార్మాట్‌లు మాత్రమే ఉంటాయి. లింగ బేధాలుండవు. మహిళా క్రికెటర్లకు ఎక్కువగా లింగబేధానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కానీ కెరీర్‌లో వాళ్లు సాధించిన రికార్డులు ఎవరూ పట్టించుకోరు. స్త్రీ, పురుష బేధాలు క్రికెట్లో సరికావు. అసలు నన్ను నేను మహిళా క్రికెటర్‌గా ఎప్పుడూ ఊహించుకోను. క్రికెట్‌ ప్రపంచంలో నేను ఒక క్రికెటర్‌ని మాత్రమే. అంతేగానీ అందులో మహిళా క్రికెటర్లు, పురుష క్రికెటర్లు అంటూ తేడాలుండటం మంచిదికాదని భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతీ మంధాన పేర్కొంది. తన క్రికెట్‌ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు కూడా మీడియాతో పంచుకుంది. ‘నా చిన్న వయసులో తెల్లవారుజామునే 5గంటలకు లేచి మా అన్నయ్యతో పాటు నెట్స్‌కు వెళ్లేదాన్ని. ప్రాక్టీస్‌ ముగిసే సమయంలో మా అన్నయ్య నాకు 10నుంచి 15 బంతులు ఆడే అవకాశం ఇచ్చేవాడు. ప్రతి రోజూ.. 15 బంతులు ముగియగానే ఆ మరుసటి రోజు పదిహేను బంతుల్ని ఎలా ఆడాలి. ఇంతకంటే మెరుగ్గా ఆడాలంటే ఏం చేయాలి.. అని ఆలోచించేదాన్ని. నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఎప్పుడూ గర్వంగా భావిస్తా’నని పేర్కొంది. భారత జట్టుకు మిథాలీరాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తర్వాత కీలక బ్యాట్స్‌ఉమెన్‌గా మారిన మంధాన తన ఫిట్‌నెస్‌ సీక్రెట్లు కూడా వెల్లడించింది. ‘ప్రోటీన్లు కలిగిన ఆహారం, కోడి గుడ్లు, సోయాబీన్లు తీసుకుంటా. మాంసాహారం మాత్రం అసలు ముట్టను. ప్రతి మ్యాచ్‌కు ముందు కొద్ది సమయం జిమ్‌కు కేటాయిస్తా. మ్యాచ్‌లు లేని సమయంలో కూడా నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తాను.. అదే నా ఫిట్‌నెస్‌కు కారణం. నా క్రికెట్‌ కెరీర్‌లో ‘రోజంతా పరుగులు చేయడం.. ఆ తర్వాత చాలాసేపు స్నానం చేయడం’ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంటా. విదేశీ గడ్డపై ఆడాల్సి వచ్చినప్పుడు అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శారీరాన్ని సిద్ధం చేసుకుంటా’నని చెప్పింది. ప్రస్తుతం మహిళా టీ20లీగ్‌లో మంధాన ట్రైల్‌ బ్లేజర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. సూపర్‌ నోవాస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మంధాన పరుగుల వరద పారించింది. దీంతో ఆ మ్యాచ్‌లో మంధాన జట్టు అలవోక విజయం సాధించింది. 2018లో మంధాన అత్యధిక పరుగులు బాదిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ 50 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లాడిన మంధాన వన్డేల్లో 42.41సగటుతో 2,336పరుగులు చేయగా టీ20ల్లో 24.96 సగటుతో 1,298 పరుగులు చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌లాడింది. అరంగేట్ర టెస్టు మ్యాచ్లోనే అర్ధశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది.