Health

ఇన్‌హేలర్ల మీద లేనిపోని అపోహలు వద్దు

Inhalers are crucial in saving asthma patients-leave all doubts behind

దీర్ఘకాలం వెంటాడేదే కావొచ్చు. పూర్తిగా నయం కాకపోవచ్చు. కానీ కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అవును. తగు జాగ్రత్తలు పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు తీసుకుంటుంటే ఆస్థమా ఉన్నా కూడా అందరిలా హాయిగా ఉండొచ్చు. అన్ని పనులూ చేసుకోవచ్చు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అయినా కూడా ఆస్థమా అనగానే మనదగ్గర ఎన్నో భయాలు. ఎన్నెన్నో అపోహలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 కోట్ల మంది ఆస్థమాతో బాధపడుతుండగా.. వీరిలో 12-13% మంది మనవాళ్లే. అంతేకాదు.. ఆస్థమాతో మరణిస్తున్నవారిలో 42% మంది మనవాళ్లే ఉంటుండటం మరింత విషాదకరం. సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నా కూడా ఆస్థమాను కట్టడి చేయటంలో విఫలమవుతున్నామనటానికి ఇదే నిదర్శనం. సమస్యను సరిగా నిర్ధారించలేకపోవటం, వేరే సమస్యలుగా పొరపడటం, సరైన చికిత్స తీసుకోకపోవటం, ఇన్‌హేలర్ల మీద లేనిపోని అనుమానాల వంటివన్నీ ఇందుకు దారితీస్తున్నాయి. అందుకే ఆస్థమా మీద అవగాహన పెంచుకోవటం అత్యవసరమని ప్రపంచ ఆస్థమా దినం నినదిస్తోంది. లక్షణాలను విశ్లేషించుకోవటం, అలర్జీ ప్రేరకాలను గుర్తించటం, సమస్య తీవ్రతను మదింపు వేయటం, అవసరమైన మేరకు చికిత్సలను మార్చుకోవటం ద్వారా ఆస్థమాకు పూర్తిగా కళ్లెం వేయొచ్చని సూచిస్తోంది. ఆస్థమా దీర్ఘకాల శ్వాసకోశ సమస్య. ప్రత్యేకించి ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలకు సంబంధించిన సమస్య. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినపుడు ఎవరికైనా దగ్గు రావటం సహజమే. నిజానికిది హాని కలిగించేవాటిని బయటకు నెట్టివేయటానికి శరీరం చేసే ప్రయత్నమే. అయితే ఆస్థమా వచ్చే స్వభావం (అటోపీ) గలవారికి ఇలాంటి పరిస్థితులు విపరీతంగా పరిణమిస్తుంటాయి. దుమ్ము ధూళి వంటివి తగిలినపుడు ఉన్నట్టుండి అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు అతిగా స్పందిస్తుంటాయి. ఆస్థమాకు మూలం ఇదే. మనం పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికీ, బయటకూ వస్తుంది కదా. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి.. మళ్లీ చిన్నచిన్న గొట్టాలుగా విడిపోతూ.. సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. గాలి ప్రవాహాన్ని నియంత్రించటంలో గాలి గొట్టాల చుట్టూ ఉండే మృదువైన కండరం కీలక పాత్ర పోషిస్తుంది. కండరం వదులైనప్పుడు గొట్టాలు విప్పారతాయి, బిగుసుకుపోతే సంకోచిస్తాయి. అలాగే గొట్టాల లోపల జిగురుపొరలోని కణాలు చిక్కటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది గొట్టాలు ఎండిపోకుండా, దుమ్ముధూళి వంటివి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. మరోవైపు రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్‌ వంటివి లోనికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. వీటి పనితీరు ఎక్కడ అస్తవ్యస్తమైనా సమస్యకు దారితీస్తుంది. ఆస్థమా వచ్చే స్వభావం గలవారిలో గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. ఫలితంగా గాలిగొట్టాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం సన్నబడుతుంది. జిగురుద్రవం ఉత్పత్తీ ఎక్కువై….అది లోపలే చిక్కుకు పోతుంది. అంతేకాదు….రోగనిరోధక వ్యవస్థలో భాగమైన మాస్ట్‌ కణాలు హిస్టమిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది గాలిగొట్టాల కండరం సంకోచించేలా చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటివన్నీ మొదలవుతాయి. కొందరిలో ఇలాంటి లక్షణాలు కొద్దిసేపే ఉండొచ్చు. మందులు తీసుకోకపోతే గంటలకొద్దీ వేధించొచ్చు. సమస్య మరీ తీవ్రమైతే ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి ఆస్థమాపై అవగాహన పెంచుకోవటం అత్యవసరం.