DailyDose

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం-రాజకీయ-05/09

Ponnala Slams TRS In Telangana MPTC ZPTC Elections

*ఇదీ కాంగ్రెస్‌ ‘ప్రేమ నిఘంటువు’
కాంగ్రెస్‌ పార్టీ తనను దూషించడానికి ‘ప్రేమ నిఘంటువు’లోని పదాలను ఎంచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బుధవారం హరియాణాలోని కురుక్షేత్ర, ఫతేహాబాద్‌లతో పాటు దిల్లీలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తూ ఆ పార్టీ తన తల్లిని కూడా విమర్శిస్తోందని అన్నారు. ఇంతకు ముందెప్పుడూ ఈ బాధాకర గాథను వివరించలేదని అన్నారు.
*ప్రభుత్వాన్ని దించేంత వరకు పోరాడాలి
దళిత, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విపక్షాలు, ప్రజాసంఘాలు కలిసికట్టుగా పోరాటాలు సాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని, నియంతృత్వ పోకడలు చూపుతున్నారని ఆరోపిస్తూ.. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కూడిన ‘అంబేడ్కర్‌వాదుల మహాగర్జన’ బుధవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో జరిగింది.
*ఇమ్రాన్‌ మీకే ఎందుకు మద్దతిస్తున్నారు?
మోదీయే మళ్లీ ప్రధాని కావాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఎందుకు కోరుకుంటున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తానన్న వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయారని నిలదీశారు. బుధవారం దిల్లీలోఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. ‘దిల్లీలో 70 శాతం ప్రజలు నివసిస్తున్న కాలనీలు అనుమతి లేనివే.
*రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తేదీ దగ్గరపడుతూండటంతో భవిష్యత్తు కార్యాచరణపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా చర్చించారు. బుధవారం ఉదయం కోల్‌కతాకు బయలుదేరి వెళ్లే ముందు దిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లి ఆయన సుమారు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు అంచనాలు అందుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను కలుపుకొని ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
*ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయాలి
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రకటించిన ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో కుట్ర దాగి ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖను బుధవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్రలకు ఆయన అందజేశారు.
*సీఎం పదవిపై ఆశలేని వాళ్లే పీసీసీ అధ్యక్షునిగా ఉండాలి: జగ్గారెడ్డి
ముఖ్యమంత్రి పదవిపై ఆశలేని వారే భవిష్యత్తులో టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కావాలనుకునే వారు సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలని..అప్పుడే అందరితో సమన్వయం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతికి పీసీసీ పదవిపై ఆశ ఉన్నట్లుందని, పార్టీ కోసం సమయం కేటాయించి పనిచేస్తే ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
*స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం: పొన్నాల
నిర్వీర్యం చేసిన తెరాస ప్రభుత్వానికి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి..నియంత పాలనకు చరమగీతం పాడాలన్నారు.
*వ్యవస్థలను అనుమానించేలా వ్యవహరించడం తగదు: అంబటి
ఎన్నికల కమిషన్‌ను కలిసి వీవీ ప్యాట్‌లను లెక్కించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అడగడాన్ని చూస్తుంటే వ్యవస్థలను అవమానించేలా, అనుమానించేలా వ్యవహరిస్తున్నట్లు ఉందని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా కేబినెట్‌ సమావేశం నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని ప్రశ్నించారు.
*పరిహారం చెల్లింపుపై రైతాంగం అసంతృప్తి: మధు
పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై రైతాంగం అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఈ అసంతృప్తిని పోగొట్టాలంటే వెంటనే ఈదురుగాలులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో గాలివానతో దెబ్బతిన్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. గతంలో జరిగిన తుపాను నష్టాన్ని కూడా ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. తాడేపల్లి మండలంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రతినిధి బృందాన్ని పంపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రైతాంగాన్ని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు.
*ఎన్నికల నిర్వహణలో పూర్తిగా విఫలం: అయ్యన్న
ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందని రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తాను 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని..ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. బుధవారం జామి వచ్చిన ఆయన ఎన్నికల కమిషన్‌ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 9.50లక్షల ఓట్లు తీసివేయడానికి సన్నాహాలు జరుగుతుంటే.. తానే ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.