Politics

తొందరగా బందరు ఫలితం

Machilipatnam 2019 Result Will Be The First

మొదటి ఫలితం మచిలీపట్నమే!
*గన్నవరం, పెనమలూరు చివరి వరకు ఆగాల్సిందే
*మధ్యాహ్నానికే తేలనున్న ప్రజాప్రతినిధుల భవితవ్యం
వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుతో ఆలస్యంగా అధికారిక ప్రకటన
ఎన్నికలు జరిగి నెల కావస్తోంది..కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. శిక్షణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు..అందరిలో ఒకటే ఉత్కంఠ.. విజయం ఎవరిని వరిస్తుందోనని ఒకటే చర్ఛ.
** ఈ నేపథ్యంలో ఈనెల 23న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో తొలి ఫలితం మచిలీపట్నం నియోజకవర్గం కాగా.. ఆఖరున పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. గత నెల 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి జిల్లాలో ప్రతి ఒక్కరూ గెలుపోటముల మీదనే చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుంది. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.? ఎవరు గెలుస్తారు.? ఎవరెవరు ఓడిపోతారు. ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది. వీటికి కారణాల ఏమిటనే అంశాలపై ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నారు. 2014 కంటే ఈ సారి జిల్లాలో 0.6 శాతం ఓటింగ్‌ పెరగడం కూడా ఆసక్తి కలిగిస్తుంది. పోస్టల్‌ ఓట్లతో కలిపితే ఇది మరింత పెరగనుంది. దీంతో పాటు.. పోలింగ్‌ రోజున ఉదయం దాదాపు రెండు గంటల పాటు బ్యాలెట్‌ యూనిట్లు మొరాయించడం, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఓటు వేసేందుకు మహిళలు, వృద్ధులు ఓపిగ్గా నిల్చోవడం. మూడు కేంద్రాల్లో తరువాత రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్‌ జరగడం తదితర పరిణామాలు అందరిలో విజయావకాశాలను రేకెత్తిస్తున్నాయి. ఇదంతా తమకు కలిసి వస్తుందంటే.. తమకని భావిస్తున్నారు.
***త్వరలో సిబ్బందికి శిక్షణ
ఈనెల 23న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంతా తర్వలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విజయవాడ పార్లమెంట్‌ స్థానంతో పాటు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ మధ్య అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును విజయవాడలోని ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తుండగా.. మచిలీపట్నం పార్లమెంట్‌.. దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను శ్రీకృష్ణా విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో కౌంటింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మోడల్‌ కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఒకవైపు పార్లమెంట్‌, రెండోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించే టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించేందుకు ప్రత్యేక టేబుల్‌ ఉంటుంది. అలాగే కౌంటింగ్‌ ఏజెంట్లకు, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక బల్లలు ఏర్పాటు చేయనున్నారు.
***తొలి ఫలితం మచిలీపట్నం
ఓట్ల లెక్కింపు సమయం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
తొలుత అరగంట సేపు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ యూనిట్లలో లెక్కింపు ప్రారంభమవుతోంది.ఎన్నికల సమయంలో బ్యాలెట్‌ యూనిట్‌పై ప్రజలు వేసిన ఓట్లు కంట్రోల్‌ యూనిట్‌లో నిక్షిప్తమవుతాయి.ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు.ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి చెందిన ఒక ఈవీఎం చొప్పున 14 ఈవీఎంలను ఒకసారి లెక్కిస్తారు. ఆ రౌండ్‌లో 14 ఈవీఎంలలోని ఓట్లు ఎవరెవరికి వచ్చాయనేది లెక్క తేలుస్తారు.కౌంటింగ్‌ సమయంలో కంట్రోల్‌ యూనిట్‌పై నిర్దేశించిన బటన్‌ను నొక్కగానే.. అభ్యర్థులకు పడిన ఓట్లు కనిపిస్తాయి.ఒక్కో రౌండ్‌ లెక్కింపునకు సుమారుగా 15 నిమిషాల సమయం పడుతుంది.ఉదాహరణకు.. మచిలీపట్నం నియోజకవర్గంలో అన్నిటికంటే తక్కువగా 199 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అంటే 15 రౌండ్లు మాత్రమే కౌంటింగ్‌ ఉంది.ఈ లెక్కన కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన 3.45 గంటలకు మచిలీపట్నం ఫలితం తేలనుంది.అలాగే ఎక్కువ పోలింగ్‌ స్టేషన్లు ఉన్న నూజివీడు, మైలవరం నియోజకవర్గాల కోసం 21 రౌండ్ల వరకు ఎదురు చూడాల్సిందే.అన్ని నియోజకవర్గాల ఫలితాలు దాదాపు మధ్యాహ్నానికి వెలువడనున్నాయి. అయితే ఎవరు గెలుపొందారనేది విషయం ఎన్నికల అధికారులు ప్రకటించడం ఆలస్యమవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి చెందిన ఐదు ఓటింగ్‌ యంత్రాలకు సంబంధించిన వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించిన తర్వాత అధికారిక ప్రకటన చేయనున్నారు. అందువల్ల ఈ జాప్యం ఉంటుందన్నారు.
***వీవీ ప్యాట్ల లెక్కింపు ఇలా..!
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ కేంద్రాల నెంబర్లను పేపర్లపై రాసి లాటరీ పద్ధతిలో ఐదు వీవీప్యాట్‌లను ఎంపిక చేస్తారు.వీవీప్యాట్‌ యంత్రంలో ఉన్న చీటీలను.. దానికి అనుసంధానంగా ఉన్న బ్యాలెట్‌ యూనిట్‌లో ఉన్న ఓట్లతో సరిచూస్తారు.పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉన్న ఓట్లు.. పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం-17ఏ’తో సరిపోలుస్తారు.అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్‌ యంత్రాలలోని స్లిప్పులను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో వెలికి తీస్తారు.వెలికి తీసిన చీటీలను ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు.తదుపరి 25 చొప్పున కట్టి లెక్కిస్తారు.అభ్యర్థుల వారీగా ఓట్లు వేరు చేసి.. వాటిని లెక్కించేందుకు 2 గంటల సమయం పడుతుంది.ఐదు వీవీప్యాట్లను మాత్రమే లెక్కించనుండటంతో.. సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు.ఈవీఎం ఓట్లను లెక్కించిన టేబుళ్లనే వీటికి వినియోగించనున్నారు. చీటీలు మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీగా వేరు చేస్తారు.