Sports

హర్మన్‌ విధ్వంసం

harman preet karus team grabs ipl womens t20 2019 championship winner

ఐపీఎల్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌కు అద్భుతమైన ముగింపు. ఉత్కంఠ ఊపేసి అభిమానులను నిలబెట్టిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సేన విజయం సాధించింది. ఆఖరి బంతికి ట్రోఫీని సొంతం చేసుకుంది. వెలాసిటీ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించింది. హర్మన్‌ (51; 37 బంతుల్లో 4×4, 3×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఛేదనలో సూపర్‌నోవాస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ చమరీ ఆటపట్టు (2; 5 బంతుల్లో) ఆదిలోనే ఔటైంది. అయితే వన్‌డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ (22; 25 బంతుల్లో 3×4)తో కలిసి మరో ఓపెనర్‌ ప్రియ పునియా (29; 31 బంతుల్లో 5×4) చక్కని భాగస్వామ్యం అందించింది. అయితే జట్టు స్కోరు 53 వద్ద వీరిద్దరూ ఔటయ్యారు. 59 వద్ద నటాలీ షివర్‌ (2), 64 వద్ద సోఫీ డివైన్‌ (3) వెనుదిరిగడంతో సూపర్‌నోవాస్‌ కష్టాల్లో పడింది. కానీ సారథి హర్మన్‌ పట్టువదల్లేదు. తొలుత ఆచితూచి ఆడింది. చెత్త బౌలింగ్‌ను వేటాడి భారీ సిక్సర్లు బాది రన్‌రేట్‌ తగ్గించింది. చివరి ఓవర్‌లో విజయం సాధించాలంటే 7 పరుగుల అవసరం. అమెలీ కేర్‌ వేసిన రెండో బంతికి ఆమె ఔట్‌ కావడంతో ఉత్కంఠ మొదలైంది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాధా యాదవ్‌ వరుసగా మూడు బంతుల్లో డబుల్స్‌ తీసి విజయం లాంఛనం చేసింది.