Editorials

ఇరాన్ కొట్టిన దెబ్బకు చమురు ఆవిరి అయింది

Irans strategic attack on oil transportation by blocking hormuz strait

చమురు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్‌తో సమానం. చమురు రవాణా ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆర్థిక వ్యవస్థలు ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటాయి. అందుకే ఏది ఏమైనా చమురు రవాణాకు మాత్రం ఆటంకం కలగకూడదని ప్రతిదేశం కోరుకుంటుంది. అలాంటి చమురులో మూడోవంతు కేవలం మూడు కిలోమీటర్ల వెడల్పైన ఒక జలసంధి నుంచి ప్రయాణించి ప్రపంచానికి అందాల్సి ఉంది. ఇప్పుడు ఆ జలసంధి రణరంగాన్ని తలపిస్తోంది. అదే హర్మూజ్‌ జలసంధి. ఇరాన్‌తో అణుఒప్పందానికి అమెరికా మంగళంపాడి ఆంక్షల కొరడాను ఝుళిపించింది. దీంతో మే1 నుంచి ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఇరాన్‌ను నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేశాయి. ఇరాన్‌కు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయవనరు. దీంతో ఇరాన్‌ కూడా తన ఆధీనంలోని హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తానని హెచ్చరించింది. దీంతో అమెరికా తన బలగాలను అక్కడ మోహరించడం మొదలుపెట్టింది. తాజాగా అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ అక్కడికి చేరుకొంది. దీంతో పాటు యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్‌టన్‌ కూడా అక్కడికి చేరుకొంది. వీటికి అదనంగా బీ-52 బాంబర్లను కూడా ఖతర్‌లోని అమెరికా వాయుసేన స్థావరంలో సిద్ధంగా ఉంచింది. దీంతో ఈ ప్రదేశంలో యుద్ధవాతావరణ నెలకొంది. ఒమన్‌-ఇరాన్‌ను వేరు చేస్తూ 33 కిలోమీటర్ల వెడల్పుతో జలమార్గం ఉంది. ఇందులో కూడా చమురు ట్యాంకర్లు ప్రయాణించడానికి కేవలం 3కిలోమీటర్ల వెడల్పు ఉన్న కొంత ప్రాంతం మాత్రమే అనుకూలం. 2011 లెక్కల ప్రకారం రోజుకు సగటున 14 చమురు ట్యాంకర్లు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2016లో ప్రపంచంలో 30శాతం చమురు ఇక్కడి నుంచే వెళ్లింది. చమురును ఉత్పత్తి చేసే ఒపెక్‌ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌లు దీనికి సమీపంలోనే ఉన్నాయి. వీటి ఉత్పత్తులు ఆసియా, యూరప్‌, ఉత్తర అమెరికాలకు వెళ్లాలంటే హర్మూజ్‌ జలసంధే శరణ్యం. ప్రపంచలోనే అత్యధిక ఎల్‌ఎన్‌జీని ఉత్పత్తి చేసే ఖతర్‌కు ఈ మార్గమే కీలకం. హర్మూజ్‌ జలసంధికి సరైన ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. సౌదీ అరేబియా, యూఏఈలు కూడా దీనికి ప్రత్యామ్నాయాలు వెతికేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరిన్ని పైప్‌లైన్లను నిర్మించడం ద్వారా చమురు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ, ఇది ఒక్కరోజులో పూర్తయ్యేదికాదు.