DailyDose

పరారీలో రవిప్రకాష్-ప్రధానాంశాలు-05/12

tv9 ravi prakash goes missing

1. భాజపాకు అగ్నిపరీక్ష
సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఆదివారం దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానాల నుంచి 979 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా అధికారులు సమస్త ఏర్పాట్లు చేశారు.
2. నేడు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను  ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదివారం ప్రకటించనున్నారు. శనివారం రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని రంగారెడ్డి నుంచి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్‌ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. నల్గొండ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు చర్చకు వచ్చినా ఆయన శాసనసభ్యుల కోటా స్థానం కావాలని కోరుతున్నందున ప్రత్యామ్నాయంగా ఇతర నేతలు తేరా చిన్నపరెడ్డి, నంద్యాల దయాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, చకిలం అనిల్‌కుమార్‌, సుంకరి మల్లేశ్‌గౌడ్‌, వై.వెంకటేశ్వర్లులలో ఒకరికి అవకాశం ఇవ్వాలని యోచించినట్లు తెలిసింది.
3. విద్యార్థి వీసాల కోసం అమెరికా యాప్‌
అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే వారి కోసం విద్యార్థి వీసా, విద్యా సంస్థల సమాచారాన్ని అందజేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురానుంది. విద్యార్థి వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి. విద్యా సంస్థను ఎలా ఎంపిక చేసుకోవాలి. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఏయే కోర్సులకు స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్స్‌ లభిస్తాయి. ఏయే విద్యా సంస్థలు అందచేస్తాయి. వీసా కోసం ఎలాంటి ధ్రువపత్రాలు కావాలి. ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. వీసా ఇంటర్వ్యూ అపాయింటుమెంటు తీసుకోవటం ఎలా? తదితర అంశాల్లో భారతీయ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు యాప్‌ను రూపొందిస్తోంది.
4. 2 రోజులే గడువు
మల్లన్నసాగర్‌ ముంపు బాధితులందరికీ పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించి, పరిహారం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో మిగిలిన వారందరికీ పరిహారం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మల్లన్నసాగర్‌ పునరావాసంతోపాటు కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం శనివారం ఏడు గంటలపాటు సుదీర్ఘంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
5. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకు
స్థానిక సంస్థల కోటాలో వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయి, కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేశాకనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించాలనే నిర్ణయానికి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల నుంచి పోటీ చేసిన ఇద్దరు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీటీసీలతోనూ విడిగా పిటిషన్‌లు వేయించాలని భావిస్తోంది.
6. అజ్ఞాతంలోకి రవిప్రకాశ్‌!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సైబరాబాద్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. టీవీ9కు సంబంధించిన పలు అంశాలు తెలుసుకునేందుకు సైబరాబాద్‌ ప్రత్యేక పోలీస్‌ బృందం, సైబర్‌ క్రైమ్‌ అధికారులు శనివారం బంజారాహిల్స్‌లో రవిప్రకాశ్‌ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్నవారిని వాకబుచేయగా.. బయటకు వెళ్లారని, ఎక్కడికి వెళుతున్నారో తమకు చెప్పలేదని వివరించారు. రవిప్రకాశ్‌ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఇందుకు పదిరోజుల గడువు కావాలని ఆయన న్యాయవాది పోలీస్‌ ఉన్నతాధికారులకు అభ్యర్థన పత్రం ఇచ్చారు.
7. మోదీజీ.. విద్వేషం వీడండి
భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్‌, ప్రధాని నరేంద్ర మోదీ తన కుటుంబంపై విద్వేషంతో ఉన్నారని, దానిని తొలగించటం తన విధి అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలిపారు. విద్వేషంతో సాధించగలిగేది విద్వేషం మాత్రమేనని, ప్రేమతోనే దాన్ని జయించగలమని హితవు పలికారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధి సుజల్‌పుర్‌లో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్‌ ప్రసంగించారు. చనిపోయిన తన తండ్రి, నానమ్మ, ముత్తాతల గురించి ప్రధాని మోదీ ఆగ్రహంతో మాట్లాడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు.
8. మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు
ఇరాన్‌ నుంచి ఎలాంటి దాడి ఎదురైనా ఎదుర్కోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. ‘‘యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్టన్‌’’ యుద్ధనౌకతో పాటు పేట్రియాట్‌ వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను మధ్యప్రాచ్యంలోకి తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌, బి-52 బాంబర్‌ టాస్క్‌ఫోర్సులను చేరతాయని తెలిపింది. నీటిపైన, భూమిపైన యుద్ధానికి వినియోగించే ఉభయచర వాహనాలు, యుద్ధవిమానాలను యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్టన్‌ మోసుకుపోతున్నట్లు వెల్లడించింది.