Politics

చేసుకోండి…పోండి!

EC Green Signals Andhra Cabinet Meeting

ఏపీ మంత్రివర్గ సమావేశ నిర్వహణ అంశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సీఎంవో రూపొందించిన అజెండాపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ శుక్రవారం చర్చించి పంపిన నాలుగు అంశాలకు ఈసీ అనుమతించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు అంశాలపై అత్యవసరంగా కేబినెట్‌ భేటీ నిర్వహించాలని సీఎంవో నిర్ణయించింది. ఫొని తుపాను, కరవు, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు అంశాలపై అత్యవసరంగా చర్చించాల్సి ఉన్నందున కేబినెట్‌ భేటీ నిర్వహించాలని భావించింది. దీనిపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఈ నాలుగు అంశాలపై చర్చించి ఈసీకి అజెండా నోట్‌ను పంపింది. మంగళవారమే కేబినెట్‌ భేటీ నిర్వహించాల్సినప్పటికీ సోమవారం సాయంత్రం వరకూ ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా అనుమతి లభించడంతో రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది.