Fashion

హైహీల్స్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు అవసరం

Precautionary Measures To Take While Wearing High Heeled Footwear

ఎత్తుమడమల చెప్పులు ఇష్టపడని వారు తక్కువే. అలాగని ఏవేవో కొనేయకుండా…ఏ సందర్భానికి ఏవి బాగుంటాయో తెలుసుకోగలిగితే సౌకర్యం.

ప్లాట్‌ఫాం హీల్స్‌: చెప్పులు ఎత్తుగా ఉన్నా… సోల్‌భాగం కాస్త వెడల్పుగా ఉంటుంది కాబట్టి… రోజంతా వేసుకున్నాఏ ఇబ్బందీ ఉండదు. ఈ చెప్పులు సంప్రదాయ దుస్తులకు చక్కని ఎంపిక. శరీరానికి అతికినట్లు సరిపోయే దుస్తులు వేసుకున్నప్పుడు బాగుంటాయి.
కోన్‌హీల్స్‌: పేరులో ఉన్నట్లే..ఈ చెప్పుల ముందుభాగం కోన్‌ ఆకృతిలో కొనదేలినట్లుగా ఉంటుంది. ఫార్మల్‌ దుస్తులమీదకు ఇవి సరైన ఎంపిక. వీటిని ప్రత్యేక సందర్భాలకు పరిమితం చేయడం మేలు.
కిటెన్‌హీల్స్‌: పార్టీలకు, పని వాతావరణంలో జరిగే కార్యక్రమాలకు ఇవి సరైన ఎంపిక. వీటి ఎత్తు రెండు అంగుళాలు అంతకన్నా తక్కువగా ఉండటం వల్ల సౌకర్యంగా ఉంటాయి. అందుకే ఎక్కువ సమయం వీటిని వేసుకుని నిల్చున్నా, నడిచినా ఏ ఇబ్బందీ ఉండదు.
స్టిలెట్టోస్‌: సన్నగా, ఎత్తు ఎక్కువగా మూడు నుంచి ఆరు అంగుళాల వరకూ ఉంటాయి. పార్టీలు, క్లబ్స్‌కి సరైన ఎంపిక. మొదటిసారి వేసుకునేవారు ఒకటికి రెండుసార్లు నడిచాకే బయటకు వెళ్లాలి.
వెడ్జ్‌ హీల్స్‌: బ్రంచ్‌, డిన్నర్‌ వంటి సందర్భాలకు అనువుగా ఉంటాయివి. ఎత్తుగా కనిపించాలనుకునేవారికి సరైన ఎంపిక. ఇది ఎత్తుగా ఉన్నా సరే… సోల్‌ వెడల్పుగా ఉంటుంది కాబట్టి.. ఎక్కువసేపు వేసుకుని ఉన్నా ఏ ఇబ్బందీ ఉండదు.

*** జాగ్రత్తలు
* తప్పనిసరిగా ఎత్తు చెప్పులు వేసుకోవాల్సిన వారికి ప్లాట్‌ఫాం హీల్స్‌ చక్కని ఎంపిక. పాదాలకు ఆసరాగా ఉంటాయి. మిగతా రకాలేవైనా ప్రయత్నిస్తున్నప్పుడు మూడుగంటలకు మించి వాటిని వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ఎక్కువ దూరం నడవాల్సినా, నిల్చోవాల్సినా వెంట ఓ జత ఫ్లాట్స్‌ ఉంచుకోవడం మంచిది. లేదా ఎత్తుచెప్పుల్ని కాసేపు వదిలేసి నడవాలి. అప్పుడే వెన్నునొప్పి నుంచి రక్షణ ఉంటుంది.
* ఆర్థోపెడిక్‌ ప్యాడ్స్‌ అని ఉంటాయి. ఎక్కువసేపు హీల్స్‌ వేసుకునేవారు వీటిని చెప్పుల లోపల ఉంచితే.. పాదాలకు ఆసరాగా ఉంటాయి. నొప్పి కూడా ఉండదు. జెల్‌ప్యాడ్స్‌ మరింత సౌకర్యంగా అనిపిస్తాయి.
* తరచూ ఎత్తు చెప్పులు వేసుకునేవారి పాదాలకు తగిన వ్యాయామం అవసరం. ఇవి వేసుకునే ముందు పాదాలను వీలైనంతవరకూ స్ట్రెచ్‌ చేయడం మంచిది. పాదం అడుగున టెన్నిస్‌బంతిని ఉంచి… దానిపై పాదంతో నొక్కుతూ బంతిని గుండ్రంగా తిప్పాలి. ఇలా చేస్తే బిగుసుకుపోయిన కండరాలు వదులుగా అవుతాయి.