Politics

కేసీఆర్-స్టాలిన్ సమావేశం

Telangana Chief Minister KCR Meets Stalin At Chennai

తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తమిళనాడు పర్యటన కొనసాగుతోంది. తాజాగా చెన్నైలోని ఆళ్వార్‌పేటలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నివాసానికి ఆయన వెళ్లారు. కేసీఆర్‌కు స్టాలిన్‌ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణాలపై చర్చించడంతో పాటు సమాఖ్య కూటమి (ఫెడరల్‌ ఫ్రంట్‌) బలోపేతానికి సహకరించాల్సిందిగా స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో కాంగ్రెస్‌, భాజపాయేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటూ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో తెరాస ఎంపీలు వినోద్‌కుమార్‌, సంతోశ్‌ కుమార్‌.. డీఎంకే ఎంపీలు దురైమురుగన్‌, టీఆర్‌ బాలు పాల్గొన్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లిన కేసీఆర్‌ ఈ రోజు శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపాకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిని తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీలు ఈ ప్రతిపాదనను స్వాగతించగా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డీఎంకే సైతం కేసీఆర్‌ లేవనెత్తే అంశాలకు మద్దతిచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీల అవసరాలను వెల్లడించడం ద్వారా మద్దతు కూడగట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.