Business

పరారీలో ఉన్న రవిప్రకాష్‌కు రెండోసారి నోటీసులు

Telangana Police Issue Second Set Of Notices To TV9 Raviprakash Today

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీఆర్‌పీసీ 41ఏ కింద సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీవీ 9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్‌..మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద సంస్థ డైరెక్టర్‌ పి.కౌశిక్‌రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. వాటిపై పోలీసులు రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిపై కేసులు నమోదుచేశారు. వీటి విచారణలో పోలీసులు ఇప్పటికే ఈ ముగ్గురికి 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేయగా రవిప్రకాశ్‌, శివాజీ స్పందించలేదు. ఈ క్రమంలో ఆదివారం విచారణకు హాజరుకావాలంటూ రెండోసారీ నోటీసులిచ్చినా రవిప్రకాశ్‌ హాజరుకాలేదు. దీంతో 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.