Sports

రాయుడు ఆశలకు మళ్లీ చిగురు

Ambati Rayudu Still In Race For ICC World Cup 2019

ఐపీఎల్‌ సీజన్‌ 12లో కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన కేదార్‌ జాదవ్‌కు ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్‌ వరకు అందుబాటులో ఉంటాడా లేడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే కోచ్‌ రవిశాస్త్రి మాత్రం జాదవ్‌కు తగిలింది పెద్ద గాయం కాదని.. ప్రపంచకప్‌కు బయల్దేరే సమయం వరకు కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఘమేఘాల మీద అతడిని తీసుకపోవడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని మండిపడుతున్నారు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించని ఆటగాడిని తీసుకపోవడం వలన జట్టుకు, అతడికి చాలా నష్టం వాటిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ కూడా సమాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే జాదవ్‌ గాయంకు సంబంధించన విషయాలను, ఫిట్‌నెస్‌ గురించి రోజువారి రిపోర్టులను బీసీసీఐ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఐసీసీ నియామవళి ప్రకారం మే 23 వరకే ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మార్చకుంటే ఇంగ్లండ్‌కు వెళ్లిన తర్వాతే మార్చాలి. దీంతో ఈ లోపే జాదవ్‌ను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. జాదవ్‌ను పక్కకు పెడితే అంబటి రాయుడినే ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే జాదవ్‌ బౌలింగ్‌ చేసే సామర్థ్యం ఉండటంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌పటేల్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా సెలక్టర్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పంత్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇండియా ఏ తరుపున ఆడుతున్న పంత్‌.. వెస్టిండీస్‌ ఏతో జరుగుతున్న సిరీస్‌లో రాణించి సెలక్టర్లు దృష్టిలో పడాలని ఆశపడుతున్నాడు.