Politics

చంద్రగిరి నుండి షిర్డీకి రైలు వేయించిన వైకాపా

Chandragiri YSRCP Chevireddy arranges train to shirdi. provides alchol too-tnilive-చంద్రగిరి నుండి షిర్డీకి రైలు వేయించిన వైకాపా

ఏపీలోని చిత్తూరు జిల్లాలోనే అది అత్యంత సున్నితమైన నియోజకవర్గంచంద్రగిరి. రాష్ట్రంలో రీపోలింగ్‌ పూర్తయినా ఐదుబూత్‌లలో ఇక్కడ మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇక్కడ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఓ పక్క ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా.. నాయకులను తన వైపు తిప్పుకునేందుకు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. తన నియోజకవర్గం ముఖ్య కేంద్రం చంద్రగిరి నుంచి షిర్డీకి ప్రత్యేక రైలును బుక్‌ చేయించారు. ఈ రైలులో ఆయన అనుచరులు చేసిన హంగామా, విచ్చలవిడిగా మద్యం సేవించి, పేకాట ఆడుతూ చేసిన గందరగోళం చుట్టుపక్కల వారిని ఆందోళనకు గురిచేసింది. చెవిరెడ్డి ఆ రైలులో సకల సౌకర్యాలు వారికి అందుబాటులో ఉంచారు. భోజనం, నీరు, ఇతర సదుపాయాలన్నీ రైలులోనే అందేలా చర్య తీసుకున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బోగీ ఏర్పాటు చేశారు. షిర్డీలో దిగిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు సందర్శించేందుకు కూడా ప్రత్యేకంగా వాహన ఏర్పాట్లు చేశారు. 23 బోగీలతో ఉన్న ఈ ప్రత్యేక రైలు గురువారం ఉదయం 10.30 నిమిషాలకు తిరుపతి, రేణిగుంట మీదుగా షిర్డీకి బయలుదేరింది. చంద్రగిరి రైల్వేస్టేషన్లో రైలు ఎక్కిన వారికి గురువారం ఉదయం స్టేషన్‌ బయటే అల్పాహారం, నీరు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన రైలు రేణిగుంట రైల్వేస్టేషన్‌లో సుమారు అరగంటసేపు ఆగింది. వైకాపా నాయకులు, కార్యకర్తలు పరుగున స్టేషన్‌ బయటకు వెళ్లి మద్యం కొని తెచ్చుకున్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో కార్యకర్తలు స్టేషన్‌ బయటకు, లోనికి పరుగులు పెట్టడంతో చుట్టుపక్కల వారు ఆందోళన చెందారు. కొందరు రైలులో, మరికొందరు ప్లాట్‌ఫాంపైనే విచ్చలవిడిగా తాగడంతో ఇతర ప్రయాణికులు నివ్వెరపోయారు. జీఆర్పీ పోలీసులు సైతం వారిని కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. పేకాట కూడా జోరుగా సాగింది. ప్రతి బోగీలోనూ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు సాగాయి. అందరితో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం షిర్డీకి వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో విరమించుకున్నారు. ఆదివారం పోలింగ్‌ జరిగే పులివర్తిపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి గ్రామాల నుంచి సైతం నాయకులు, కార్యకర్తలు యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. కేవలం నాయకులు, కార్యకర్తలకే ఇది పరిమితమైంది. మహిళలు ఎవరూ లేరు. శుక్రవారం షిర్డీలో దర్శనాలు పూర్తయిన అనంతరం వారిని ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ శనివారం చంద్రగిరికి తీసుకొస్తారు.