Health

మెంతుల మంచితనం ఎంతెంతో!

Fenugreek seeds have tons and tons of healthy benefits-tnilive-మెంతుల మంచితనం ఎంతెంతో!

మెంతులను ప్రతి ఇంట్లోనూ పోపు గింజలతో కలిపి వాడుతారు. వీటిని ఎక్కువగా పచ్చళ్లలో, చారు, పులుసు వంటివి చేసినప్పుడు వాటిలో వేస్తారు. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే మెంతులు ఆహారంగానే కాదు, మనకు ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. వాటి వల్ల మనకు ఏమేం లాభాలు కలుగుతాయో, వాటితో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు మెంతులు ఉపయోగపడతాయి. అందుకు వాటిని ఎలా తీసుకోవాలంటే.. మెంతులను నెయ్యిలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని చూర్ణం చేయాలి. ఆ చూర్ణానికి సమానంగా గోధుమ పిండిని కలపాలి. దాంట్లో కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. లేదంటే మెంతులతో చేసిన కషాయం, మెంతి కూర పప్పును తిన్నా చాలు, పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

2. గర్భిణీలు ప్రసవించాక మెంతులను రెగ్యులర్‌గా ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. దీంతో గర్భాశయం శుభ్రమవుతుంది. పేగుల్లో కదలిక సరిగ్గా ఉంటుంది.

3. మెంతులను 10 నుంచి 20 గ్రాముల మోతాదులో తీసుకుని పొడి చేయాలి. ఆ పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. దీంతో రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె సమస్యలు రావు.

4. మెంతులు వేసి చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు రావు. అసిడిటీ ఉండదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం పోతుంది.

5. ప్రతి రోజూ మూడు పూటలా భోజనానికి ముందు 10 గ్రాముల మెంతి పొడిని ఒక గ్లాస్ నీటిలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

6. మెంతులను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని కొంత సేపు వాటిని నీటిలో నానబెట్టి తింటే మలబద్దకం తగ్గుతుంది.

7. అర టీస్పూన్ మెంతి పొడి, ఒక నిమ్మకాయ రసం, కొంత తేనె కలిపి తీసుకుంటే జ్వరం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. గొంతు సమస్యలు పోతాయి.

8. మెంతులను పొడి చేసి అందులో కొంత నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని గాయాలు, పుండ్లు అయిన చోట రాయాలి. లేదంటే తామర, గజ్జి, ఎండ వల్ల కందిపోయిన చర్మం వంటి సమస్యలు ఉంటే ఆయా భాగాల్లో ఈ మిశ్రమాన్ని రాయాలి. దీంతో ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

9. మెంతులను పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి తయారు చేసిన పేస్ట్‌ను తలకు పట్టించాలి. అనంతరం కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు బాధించదు. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

10. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపునే తిని ఆ నీటిని తాగాలి. లేదంటే పెరుగులో మెంతి పొడిని కలుపుకుని తినవచ్చు. ఇలా చేయడం వల్ల అధిక బరువు తగ్గి నాజూగ్గా తయారవుతారు.