Health

తెలంగాణా ప్రజానీకంలో పెరిగిపోతున్న బీపీ

High Blood pressure in telangana population reveals health surveys across the state-tnilive-తెలంగాణా ప్రజానీకంలో పెరిగిపోతున్న బీపీ

తెలంగాణలో అధిక రక్తపోటు ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల ముప్పును నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అసాంక్రమిక వ్యాధుల(ఎన్‌సీడీ)ను పరీక్షించే కార్యక్రమానికి గతేడాదే శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో జనగామ, సిద్దిపేట, కరీంనగర్‌, మహబూబాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ గ్రామీణ, వరంగల్‌ పట్టణ, మెదక్‌, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నిర్ధారణ పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జిల్లాల్లోనే మొత్తం 32,02,820 మందిని పరీక్షించగా.. వీరిలో అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని సందేహించినవారు 3,86,639 మంది ఉన్నారు. అంటే రెండు వ్యాధులు కలుపుకొని దాదాపు 12.07 శాతం మంది ఉండగా.. వీరిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిర్ధారణ, చికిత్స కోసం పంపించారు. వీరిలో 2,14,091 మందిలో అధిక రక్తపోటు, మధుమేహం ఉందని కొత్తగా నిర్ధారించగా.. 2,02,133 మంది పీహెచ్‌సీల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అధిక రక్తపోటుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్నవారికి.. ఈ కొత్తగా నిర్ధారించినవారిని కలుపుకుంటే మొత్తంగా 2,72,957(8.7శాతం) మంది అధిక రక్తపోటు బాధితులున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. శుక్రవారం(ఈ నెల 17) ‘ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినం’ సందర్భంగా జీవనశైలి వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను ముమ్మరంగా ప్రచారం చేయాలని సర్కారు నిర్ణయించింది. గతంలో వెల్లడైన వేర్వేరు ఫలితాల్లోనూ అధిక రక్తపోటు రోజురోజుకూ విజృంభిస్తున్నట్లుగా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రెండేళ్ల కిందట విడుదల చేసిన ‘జిల్లా స్థాయి ఇంటింటి సర్వే-4’ ప్రకారం.. రాష్ట్ర సగటు(20శాతం) అధిక రక్తపోటు కంటే ఎక్కువ శాతం మంది హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, మెదక్‌ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఉన్నట్లు వెల్లడైంది. 2016లో విడుదలైన ‘జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే’ ప్రకారంగా కూడా రాష్ట్రంలో 12.2 శాతం మంది పురుషులు, 7.4 శాతం మంది మహిళలు అధిక రక్తపోటు బాధితులని తేలింది. గతేడాది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2017’లోనూ తెలంగాణలో అధిక రక్తపోటు బాధితులు సుమారు 15.75 శాతంగా పేర్కొంది. ఈ సర్వేల ఫలితాలకు కొనసాగింపుగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నిర్వహిస్తున్న పరీక్షల్లో తాజా ఫలితాలు వెల్లడయ్యాయి. తొలిదశ ఫలితాల్లో అత్యధికంగా అధిక రక్తపోటు బాధితులు వరంగల్‌ పట్టణ(15.1శాతం) జిల్లాలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి(14.5శాతం), సిద్దిపేట(13.7శాతం), మెదక్‌(13.6శాతం), రాజన్న సిరిసిల్ల(13శాతం)ఉన్నాయి.

జీవనశైలి వ్యాధులను అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణంలో ఇళ్ల వద్దనే అధిక రక్తపోటు, మధుమేహం తదితర పరీక్షలు నిర్వహిస్తోంది. ఏఎన్‌ఎంలు, ఆశాలు తమ వెంట గ్లూకోమీటరు, బీపీ పరికరాన్ని తీసుకెళ్లి, ఇంటింటికీ తిరుగుతూ ప్రజల వద్దకెళ్లి పరీక్షలు నిర్వహిస్తుండటంతో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్ల పైబడినవారిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా అధిక రక్తపోటు ఉందనే సందేహం వచ్చినవారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తున్నారు. అయితే సందేహించినవారిలో దాదాపు 40 శాతం మంది చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చికిత్సను కూడా ప్రజల వద్దకే తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గ్రామీణంలో అమలవుతున్న సంచార వైద్య సేవలన్నింటినీ మరింత సమర్థంగా వినియోగించుకొని.. అధిక రక్తపోటు ఉందని గుర్తించినవారికి వారి సొంతూళ్లలోనే శిబిరాలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందజేయడం, అవసరమైన ఇతర పరీక్షలు నిర్వహించడం, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు వంటివి అమలు చేస్తున్నారు. ఈ కార్యాచరణపై ఇటీవలే ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌.. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వీటితో బాధపడుతున్న రోగులకు గ్రామంలోనే ఔషధాలను అందజేస్తున్నారు.

రెండో విడతలో నాగర్‌కర్నూల్‌, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్‌, ఖమ్మం, నారాయణపేట, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షల పథకాన్ని గత ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ జిల్లాల్లో దాదాపు 44 శాతం పరీక్షలను నిర్వహించారు. దీన్ని కొనసాగిస్తూ మిగిలిన జిల్లాల్లోనూ గత నెలలో ఇంటింటికీ పరీక్షల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆగస్టులోగా అన్ని జిల్లాల్లోనూ అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ పరీక్షల పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
* ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు అంచనా. అయితే వీరిలో సగం మందికి పైగా ఆ విషయం తెలియదు.
* అధిక రక్తపోటుకు ప్రధాన కారణాల్లో 30 శాతం విచ్చలవిడిగా ఉప్పు వినియోగమే.
* గుండెజబ్బులు, పక్షవాతం తదితర ప్రమాదకర వ్యాధులు రావడానికి 50 శాతం కారణం అధిక రక్తపోటే
* ఆరోగ్య సంరక్షణ వ్యయంలో 10 శాతం నేరుగా అధిక రక్తపోటు ఔషధాలకేనని ఒక అంచనా.