Business

జెట్ సంక్షోభం ముగియకముందే…ఇండిగోలో లుకలుకలు

Indigo airlines venture capitalists and promoters rahul and rakesh split-tnilive-telugunewsinternational-జెట్ సంక్షోభం ముగియకముందే...ఇండిగోలో లుకలుకలు

మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో.. అసలే జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోయి, దేశీయ విమానయాన రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో.. మార్కెట్‌ వాటా పరంగా అతిపెద్ద సంస్థ అయిన ఇండిగో వ్యవస్థాపక ప్రమోటర్ల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన వార్తలు గందరగోళానికి గురిచేశాయి. ఫలితం.. స్టాక్‌మార్కెట్‌లో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు గురువారం రూ.142 మేర నష్టపోయింది. అయితే సంస్థలో సంక్షోభం వార్తలను ఖండిస్తూ, అవన్నీ ఊహాగానాలేనని ఇండిగో ప్రకటించింది. గత రెండురోజుల పరిణామాలను గమనిస్తే ఇండిగో ప్రమోటర్లయిన రాహుల్‌ భాటియా, రాకేశ్‌ గంగ్వాల్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని, ఇరు పార్టీలు వేర్వేరు న్యాయవాద సంస్థలను ఆశ్రయించాయని ఒక బిజినెస్‌ ఛానల్‌ ప్రసారం చేసిన వార్త సంచలనమే అయ్యింది. ‘పాలనాధికార నియంత్రణకు సంబంధించే ప్రమోటర్ల మధ్య విభేదాలు వచ్చాయని’ విశ్వసనీయ వర్గాలు తమకు తెలిపినట్లు వార్తా ఛానల్‌ పేర్కొంది. పాలనా యంత్రాంగంలో తన సొంత బృందాన్ని చొప్పించడం ద్వారా, సంస్థపై పట్టు సాధించేందుకు గంగ్వాల్‌ ప్రయత్నిస్తున్నారని రాహుల్‌ భాటియా భావించడం వల్లే, విభేదాలు పెరుగుతూ వచ్చాయని చెబుతున్నారు. అయితే 2018 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదిత్య ఘోష్‌ సంస్థ నుంచి తప్పుకున్నపుడే ఇద్దరు ప్రమోటర్ల మధ్య అంతరం ప్రారంభమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. తదుపరి మేనేజ్‌మెంట్‌ స్థానాల్లో దేశం బయట నివశిస్తున్న వారిని నియమించడంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. రాకేశ్‌ గంగ్వాల్‌ గతంలో తాను పనిచేసిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి, వీరిని ఎంపిక చేసుకుని, నియమించడంతో రాహుల్‌కు అనుమానాలు పెరిగాయి. ఇండిగో కార్యకలాపాలను శరవేగంతో విస్తరించే చర్యలకు గంగ్వాల్‌ సై అంటుంటే, అప్రమత్తతో వ్యవహరించాలనేది రాహుల్‌ అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే తమ మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలను సర్దుమణిగేలా చూసుకోవడం ద్వారా, ఇండిగో కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రమోటర్లు ఇద్దరూ జాగ్రత్త పడ్డారు.

ఒకవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిపోగా, ఎయిరిండియా కూడా ప్రభుత్వం అందించే నిధులతో నడుస్తోంది. రూ.1500 కోట్ల నిధులు లేక, ఎయిరిండియాకు చెందిన 20 విమానాలు నెలల తరబడి విహారాన్ని నిలిపివేశాయి. మార్కెట్‌ అగ్రగామిగా, మరింత ముందుకెళ్లేందుకు ప్రస్తుత సమయం తమకు ఎంతో కీలకమని వ్యవస్థాపకులిద్దరూ విశ్వసిస్తున్నారు. దశాబ్దాలుగా పూర్తిస్థాయి విమానయాన సేవలందిస్తున్న 2 దిగ్గజ సంస్థలు నిధుల కొరతతో విలవిలలాడుతూ, వదిలేస్తున్న మార్కెట్‌ను అందిపుచ్చుకోవాలని వీరు భావిస్తున్నారు. అయితే ఏ విధంగా ఆ ప్రక్రియ ముందుకు సాగాలనే విషయంలోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. అంతర్జాతీయ మార్గాల్లో మరింత దూసుకెళ్లాలంటే, పెద్ద విమానాలు (వైడ్‌బాడీ) సమీకరణ అవసరమని రాహుల్‌ భావిస్తున్నారు. సొంతగా సుదూరాలకు విమానాలు నడపడం కంటే, విదేశీ విమానయాన సంస్థలతో కోడ్‌ షేరింగ్‌ ఒప్పందాలు చేసుకోవడం మంచిదన్నది గంగ్వాల్‌ అభిప్రాయం. తక్కువ-మధ్యస్థాయి గమ్యాలకు అనువైన సింగిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మోడళ్లపై గంగ్వాల్‌ ఆసక్తిగా ఉన్నారని ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది. క్రమశిక్షణాయుత సంస్థగా పేరున్న ‘ఇండిగో’లో పరిస్థితులు అంత సజావుగా లేదనే విషయం గత వేసవిలో బయటకు వచ్చింది. వారాంతపు సెలవు దినాల్లోనూ పనిచేయాలని పైలట్లకు తరచు పిలుపులు రావడం ఆరంభమైంది. వీరికి విధులు కేటాయించే రోస్టరింగ్‌ విభాగం నుంచి అతి తక్కువ వ్యవధిలో సమాచారం రావడం ఇబ్బంది కలిగించింది. ‘విధుల నుంచి వైదొలగాలన్నా, తొలగించాలన్నా కనీసం ఏడాది ముందుగా సమాచారం ఇవ్వాలంటూ’ 2017లో తెచ్చిన నిబంధన పరిస్థితిని సంక్లిష్టం చేసింది. ‘ఇండిగోలో వేతనాలు ఎక్కువ. అందువల్ల ఇతర సంస్థల నుంచి సులభంగా నిపుణులను ఆకర్షించగలదు. అయితే ఏడాది నోటీస్‌ వల్ల, ఇలాంటి అవకాశాలు కష్టతరంగా మారాయి’ అని పైలట్ల నియామకాలు జరిపిన ఇండిగో ఎగ్జిక్యూటివ్‌ ఒకరు అప్పట్లోనే వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా దేశాలపై ఇండిగో దృష్టి సారించింది. అక్కడ కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలు తొలగించిన పైలట్లను ఆకర్షించేందుకు, నియామక బాధ్యతలు చూసే రిక్రూటర్లను పంపింది. అయితే ఒక సంస్థ నుంచి తొలగింపునకు గురైన పైలట్‌ను నియమించుకోవాలంటే, పలు అనుమతులు కావాల్సి ఉంది. అందువల్ల ఈ ప్రక్రియ నెమ్మదించింది. సెలవు రోజుల్లో పనిచేసేందుకు అదనపు మొత్తం ఇస్తామని గత జూన్‌లో పైలట్లకు ఇండిగో తొలిసారిగా ఆఫర్‌ ఇచ్చింది. ఇండిగో పైలట్లలో అత్యధికులు 56 రోజుల సెలవు పొందే ఒప్పందంపై పనిచేస్తున్నారు. ఇందులో 22 రోజులు తగ్గించుకుని, సెలవులను 42 రోజులకు పరిమితం చేసుకుంటే, రూ.35,000-86,500 బోనస్‌ ఇస్తామని ఇండిగో తెలిపింది. ఇందువల్ల ప్రయోజనం లేకపోగా, సంస్థకే నష్టం వాటిల్లింది. కారణం.. ఒక ఏడాది కాలవ్యవధిలో ఒక పైలట్‌ 1,000 గంటలు మాత్రమే విమానం నడిపే వీలుంటుంది. సెలవుల కుదింపు వల్ల, సంస్థ పైలట్ల గడువు తొందరగా పూర్తయ్యింది. దీంతోపాటు పలు నగరాల నుంచి కొత్త సర్వీసులు ప్రారంభించడంతో, క్యాబిన్‌ సిబ్బంది కొరతా ఏర్పడింది. సిబ్బంది వినిమయంలో గందరగోళం నెలకొంది. ముంబయిలో రాత్రిపూట 6 విమానాలు మాత్రమే పార్క్‌ చేసే వీలున్నా, 250 మంది పైలట్లు అక్కడ ఉండే పరిస్థితి ఏర్పడింది. పుణె, జైపుర్‌, భువనేశ్వర్‌ వంటి చిన్న కేంద్రాలకు సిబ్బందిని నియమించలేదు. ఫలితంగా రోజువారీ విధులు పూర్తయిన పైలట్లకు విడిది, ఇతర ఖర్చులు భరించాల్సిన (లే అవర్‌) బాధ్యత సంస్థపై పడింది. తగినంత విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండిగో పైలట్లలో పలువురు ఒకసారి ఇంటినుంచి బయలుదేరితే, 3-4 రోజులు బయటే ఉంటున్నారు. ప్రమోటర్ల మధ్య విభేదాలున్నాయనే వార్తల నేపథ్యంలో, గురువారం ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 8.82 శాతం (రూ.142) నష్టపోయి రూ.1466.60కు చేరింది. ఒక దశలో 9.82 శాతం నష్టపోయి, రూ.1450.50కి చేరినా, మళ్లీ కాస్త కోలుకుంది.