Politics

ఆ ఒప్పందం కావాలని తప్పుడు పత్రాలతో తయారీ

Raviprakash and sivaji in neck deep troubles with fake documents and forgery

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. శక్తి అనే వ్యక్తి నుంచి డైరెక్టర్ ఎంకేవీఎన్‌ మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్‌కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఏబీసీఎల్‌ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య జరిగిన ఈ-మెయిల్‌ సంభాషణలను సైబర్ క్రైమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరక్కుండా రవిప్రకాశ్, ఆయన అనుచరులు సర్వర్‌లో డిలీట్ చేసినప్పటికీ, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీసినట్లు సమాచారం. రవిప్రకాశ్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్‌ను వాస్తవానికి ఏప్రిల్‌13, 2019న తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాఫ్ట్‌ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్‌ చేసిన శక్తి… రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపినట్లు సమాచారం. ఫిబ్రవరి 20, 2018న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి. వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇక శివాజీ ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్‌ను విజయవాడకు చెందిన ఓ న్యాయవాది రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఏప్రిల్‌ 14, 2019న ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్‌లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం 9 గంటలకు విజయవాడ అడ్వొకేట్‌కు పంపించాల్సి ఉంటుందంటూ రవిప్రకాశ్‌, ఆయన అనుచరులకు శక్తి మెయిల్‌ పంపించిన సందేశాలు పోలీసులకు చిక్కాయి. అదే రోజు ఈ పిటిషన్‌పై రవిప్రకాశ్ ఆయన అనుచరులు మెయిల్‌లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలను సేకరించారు. వీటి ఆధారంగానే సెక్షన్ 41 సీఆర్పీసీ కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు.