Movies

రాళ్లపల్లి మృతి

Actor Rallapalli Passes Away

ప్రముఖ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు(73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మోతీనగర్‌లోని ఆయన నివాసం నుంచి కుటుంబ సభ్యులు మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాళ్లపల్లి తుదిశ్వాస విడిచారు. 1979లో ‘ కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి… శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య, ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరాకాండ, భలే భలే మగాడివోయ్‌ తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో విశేషఆదరణ పొందారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన సేవలందించారు. తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1955 అక్టోబర్‌ 10న రాళ్లపల్లి జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు నాటకాల పట్ల మక్కువ ఎక్కువ. ఆ ఇష్టంతోనే 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు. కేవలం హాస్యనటుడిగానే కాకుండా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలక్షణ నటుడ్ని కోల్పోయినందుకు సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపల్లి పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుంచి మోతీనగర్‌లోని ఆయన నివాసానికి తరలిస్తున్నారు.