Agriculture

హుజూరాబాద్‌లో 60క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్

agriculture officers seize 60 quintals of fake seeds in huzurabad telangana-tnilive telugu news interantional latest nri nrt global telugu news agriculture news in telugu latest - హుజూరాబాద్‌లో 60క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్

హుజూరాబాద్‌లోని ఓ ప్రయివేటు గోదాములో నిల్వ చేసిన 60 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. స్థానిక ఓ వ్యాపారి భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ శోభన్‌కుమార్‌, హుజూరాబాద్‌ ఏసీపీ కృపాకర్‌, జేడీఏ శ్రీధర్‌తో పాటు పలువురు అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. గోదాములో సంచుల్లో నింపిన విడి పత్తి విత్తనాలతో పాటు వందల సంఖ్యలో నిల్వ ఉన్న 120 గ్రాముల నాన్‌ బీటీ విత్తన ప్యాకెట్లు పట్టుకున్నారు. అలాగే ప్యాకింగ్‌ కవర్లు, పత్తి గింజలకు కలిపే రంగును స్వాధీనం చేసుకున్నారు. నాన్‌ బీటీ విత్తనాలను విడి సంచుల్లో నింపి వాటికి రంగు కలిపి వీటిని పేరొందిన కంపెనీల ప్యాకెట్లలో నింపి బీటీ విత్తనాలుగా నమ్మిస్తూ అధిక ధరకు రైతులకు అంటగడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఎస్‌.ఆర్‌. సీడ్స్‌, రజనీ సీడ్స్‌ పేరిట ఉన్న 120 గ్రాముల ఖాళీ సంచులను గుర్తించిన జేడీఏ శ్రీధర్‌ అసలు వాటిని జిల్లాలో మార్కెటింగ్‌ చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అందుకే వీటిని నకిలీ విత్తనాలుగానే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి గురువారం సాయంత్రం గోదాములో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుజూరాబాద్‌లోని గోదాములో 60 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడినట్లు చెప్పారు. శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నాలుగేళ్లుగా వివిధ ప్రాంతాల్లో విడి పత్తి విత్తనాలను సేకరించి 120 గ్రాముల ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నట్లు చెప్పారు. ఇందుకోసం హుజూరాబాద్‌లోని ఓ గోదామును లీజుకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తన ప్యాకెట్లను మహారాష్ట్ర, ఆదిలాబాద్‌, వరంగల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలించి రైతులకు అంటగడుతున్నట్లు వివరించారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పోలీసులు, వ్యవసాయాధికారులు కలిసి రెవెన్యూ అధికారుల సమక్షంలో గోదామును తనిఖీ చేసి 68 సంచుల్లో నిల్వ చేసిన 40 క్వింటాళ్ల విడి పత్తి విత్తనాలు, 50 సంచుల్లో ఉన్న 20 క్వింటాళ్ల విత్తన ప్యాకెట్లతో పాటు వివిధ కంపెనీల పేరిట ఉన్న 10వేల ఖాళీ ప్యాకెట్లు, రెండు కెమికల్‌(విత్తనాలకు కలిపే రంగు) క్యాన్లు సీజ్‌ చేసినట్లు చెప్పారు. నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు రూ.70 లక్షల విలువ ఉంటుందన్నారు. కాగా నిందితుడు శ్రీనివాస్‌గౌడ్‌ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తన అమ్మకాలపై నిఘా పెట్టామని, అనుమతి లేకుండా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని, ఎవరైనా అమ్మితే నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ జనార్దన్‌, హుజూరాబాద్‌ పట్టణ సీఐ మాధవి, ఎస్‌.ఐ.చంద్రశేఖర్‌, ఏడీఏ ఆదిరెడ్డి, ఆర్‌.ఐ. ప్రసాద్‌, వ్యవసాధికారులు సునీల్‌, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే వందల కంపెనీలు వివిధ రకాల పేర్లతో విత్తనాలను మార్కెట్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే తరహాలో శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గాజుల శ్రీనివాస్‌గౌడ్‌ గుట్టుచప్పుడు కాకుండా హుజూరాబాద్‌ కేంద్రంగా నకిలీ విత్తన వ్యాపారం చేస్తూ టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు, వ్యవసాయాధికారులకు పట్టుబడ్డాడు. వాస్తవానికి నాన్‌ బీటీ విత్తనాలకు డిమాండ్‌ లేదు. ఇలాంటి విత్తనాలకు రంగు కలిపి బీటీ విత్తనాలుగా మార్కెట్‌లో అమ్మడాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రూ.730 ధర కల్గిన 450 గ్రాముల బీటీ విత్తనాల ప్యాకెట్‌లోనే ఆయా కంపెనీలు 120 గ్రాముల నాన్‌ బీటీ విత్తన ప్యాకెట్‌ను ఉచితంగా ఇస్తున్నాయి. ఇలాంటి విత్తన ప్యాకెట్లను సేకరించి విడి సంచుల్లో నింపడం, వాటికే రంగు కలిపి బీటీ విత్తనాలుగా చెలామణి చేస్తున్నారు. అయితే భారీ మొత్తంలో పట్టుబడిన నాన్‌ బీటీ విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చారనే విషయంపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పోలీసులు కూపీ లాగుతున్నారు. ఎస్‌.ఆర్‌. సీడ్స్‌, రజనీ సీడ్స్‌ కంపెనీలు ఎక్కడివి, వాటికి మార్కెటింగ్‌ అనుమతి లేకున్నా విత్తన ప్యాకెట్లు ఎందుకు తెచ్చారు, దీని వెనుక ఎవరెవరి హస్తం ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా రంగు కలిపిన నకిలీ బీటీ పత్తి విత్తనాలను అక్కడి పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఆ విత్తనాలు కూడా హుజూరాబాద్‌ నుంచే సరఫరా అయినట్లు సమాచారం. రైతులకు సంబంధిత వ్యాపారులు విత్తన రకం, లాట్‌నంబర్‌, ధర తదితర వివరాలను నమోదు చేసి పక్కా రసీదు ఇవ్వాలి. ఇలా ఉంటేనే విత్తనాల వల్ల నష్టపోతే ఆయా కంపెనీలు విత్తన చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉంది. విత్తనాలకు అనుమతి ఉన్నా నేరుగా గ్రామాల్లో అమ్ముకోవడానికి వీలు లేదు. లైసెన్స్‌ కల్గిన డీలర్లు మాత్రమే విత్తన ప్యాకెట్లు అమ్మడంతో పాటు ఏ రోజుకారోజు అమ్మకాలు, నిల్వల వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు వ్యవసాయాధికారులకు అందజేయాలి. ఇలాంటి నిబంధనలు పక్కనపెట్టిన వ్యాపారి గాజుల శ్రీనివాస్‌గౌడ్‌ యథేచ్ఛగా నకిలీ విత్తనాలు అమ్ముతుండటం స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడు శ్రీనివాస్‌గౌడ్‌ పట్టుబడితే నకిలీ విత్తన వ్యాపారం గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది.