Fashion

మాకేం వద్దు. బంగారం ఒక్కటి ఉంటే చాలు.

indians doesnt want to buy anythin for fashion except gold and ornaments - crazy indians dying for gold - tnilive - telugu news international

ప్రజలకు షాంపూలు, సెంట్లు వద్ద్దట. బంగారం మాత్రమే కావాలట. అవును మరి షాంపూలు సెంట్ల వంటి ఉత్పత్తుల కొనుగోళ్ళు దేశవ్యాప్తంగా పడిపోతే బంగారం కొనుగోలు మాత్రం పెరిగాయి. యూబీఎస్ ఎవిడెన్స్ ల్యాబ్ చేసిన సర్వేలో తేలింది విషయం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పడిపోవడం, పట్టణ ప్రాంతాల్లో తిండి, చమురు రేట్లు పెరగడం వల్లే పర్సనల్ కేర్, హోమ్‌‌కేర్ అమ్మకాలు పడిపోయాయని చెప్పింది. ఇండియాలోని 15 కీలక నగరాల్లో 1711 ఇళ్లకు వెళ్లి చేసిన ఇంటర్వ్యూల్లో ఈ విషయం తేలినట్లు పేర్కొంది. 2019 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఇండియాలో పర్సనల్ కేర్ కొనుగోళ్లు 10.5 శాతం తగ్గాయి. 2018లో సగటున ఓ ఇండియన్ పర్సనల్ కేర్‌‌పై 565 రూపాయలు ఖర్చు చేస్తే, ఈ ఏడాది అది 505 రూపాయలకు పడిపోయింది. గతేడాది ఈ నాలుగు నెలల్లో డియోడ్రెంట్ల కొనుగోళ్లు 45 శాతంగా ఉంటే, ఈ ఏడాది మాత్రం 41 శాతానికి తగ్గిపోయాయి. షవర్ జెల్ కొనుగోళ్లు కూడా 14 నుంచి 11 శాతానికి, హెయిర్ సీరమ్ కొనుగోళ్లు 15 నుంచి 8 శాతానికి పడిపోయాయి. రోజూ వాడే టూత్ పేస్ట్ అమ్మకాలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. పతంజలి కంపెనీ ఎంట్రీతో ఇండియాలో ఊపందుకున్న ఆయుర్వేదం, హెర్బల్ ప్రొడక్టుల అమ్మకాలూ ఈ ఏడాది నెమ్మదించాయి. గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 9 శాతం పెరిగి 43 శాతానికి ఎగసిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం మళ్లీ 35 శాతానికి అమ్మకాలు పడిపోయాయి. ఇక, హోం కేర్‌‌ ప్రొడక్ట్స్‌‌లో జనవరి నుంచి ఏప్రిల్ మధ్య ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌‌నర్స్, అంట్లు తోమే లిక్విడ్‌‌ల అమ్మకాలు 14.5 శాతం తగ్గాయి. దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయం తగ్గడం మూలానే ఈ పరిస్థితి వచ్చిందని యూబీఎస్ ఎవిడెన్స్ రిపోర్టు వెల్లడించింది. 2018లో ఓ కుటుంబం వీటిపై నెలకు సగటున 593 రూపాయలు ఖర్చు చేయగా, ఈ సారి 505 రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అమ్మకాలు మెరుగ్గా ఉన్నది ఒక్క గోల్డ్ కు మాత్రమే. 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 49 శాతం మంది, 35 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న నడి వయసు వారిలో 51 శాతం మంది బంగారాన్ని ఇంటికి తెచ్చుకునేందుకు ఆసక్తి చూపారు. మొత్తం మీద 2018లో 35 శాతంగా ఉన్న పసిడి కొనుగోళ్లు, ఈ సారి 42 శాతానికి ఎగిశాయి.