WorldWonders

అమెరికా హెచ్చరికలకు టర్కీ భేఖాతరు

turkey buys s400 from russia amidst americas warnings

అమెరికాకు నాటో దేశమైన టర్కీ పెద్ద ఝలక్‌ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడు తైయిప్‌ ఎర్డగాన్‌ మాట్లాడుతూ.. రష్యా నుంచి ఎస్‌-400 కొనడం ఎప్పుడో ఖాయమైపోయిందిని తెలిపారు. భవిష్యత్తులో రష్యాతో కలిసి ఎస్‌-500 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ఉత్పత్తి కూడా చేస్తామని ప్రకటించారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇప్పటికే నాటో దేశమైన టర్కీ ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉంది. టర్కీకి సామ,దాన,భేద దండోపాయాలతో నచ్చజెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. అమెరికాతో సహా కలిసి తొమ్మిది దేశాలు చేపట్టిన ఎఫ్‌-35 యుద్ధవిమానాల తయారీలో టర్కీ కూడా ఒకటి. దాదాపు 25ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తోంది. టర్కీ 100 ఎఫ్‌-35 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత ఖరీదైన ప్రాజెక్టు ఎఫ్‌-35దే. దీంతో ఈ విమానాలను ఎంత ఎక్కువగా విక్రయిస్తే అంత ప్రాజెక్టు ఖర్చు కలిసివస్తుంది. ఇప్పుడు రష్యాకు చెందిన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ, ఎఫ్‌-35 యుద్ధవిమానాలను టర్కీ ఒకేసారి వినియోగించే పరిస్థితి తలెత్తింది. దీంతో ఎఫ్‌-35కు ఉండే అతిస్వల్ప రాడార్‌ సిగ్నెచర్‌ను ఎస్‌-400 రాడార్లు గుర్తించడం మొదలుపెడితే అవి రష్యాకు చేరే ప్రమాదం ఉంది. అదే జరిగితే రష్యా ఎఫ్‌-35లను గుర్తించే విధంగా రాడార్లను అభివృద్ధి చేస్తుంది. అప్పుడు ఎఫ్‌-35 ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లువుతుంది. అందుకే టర్కీపై అమెరికా విపరీతమైన ఒత్తిడి తెస్తోంది. కానీ, ఎఫ్‌-35 రాడార్‌ సిగ్నెచర్‌లు ఎస్‌-400కు చేరకుండా చర్యలు తీసుకుంటామని టర్కీ చెబుతున్నా ఇది దాదాపు అసాధ్యం. అందుకే టర్కీకి ఎఫ్‌-35లను ఇప్పటి వరకు సరఫరా చేయలేదు. కాకపోతే భవిష్యత్తులోనైనా ఎఫ్‌-35లను దక్కించుకొంటామని టర్కీ ధీమాగా చెబుతోంది. టర్కీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయింది. టర్కి కరెన్సీ లీరా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత ఏడాది నాటికి 51.6 బిలియన్‌ డాలర్ల అప్పు ఉంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ఎక్కువ. అదే సమయంలో అమెరికా పాస్టర్‌ ఆండ్రూబ్రాన్సన్‌ను టర్కీ అరెస్టు చేసింది. దేశంలో జరిగిన తిరుగుబాటు కుట్రలో ఇతడు ఉన్నట్లు అనుమానిస్తోంది. దీంతో అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా ఆంక్షలు చట్రంలో టర్కీ ఇరుక్కుంది. ఆ దేశ న్యాయ, ఇంటరీరియర్‌ మంత్రిపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత కేవలం టర్కీ నుంచి వచ్చే స్టీల్‌, అల్యూమినియంపై టారీఫ్‌లను రెట్టింపు చేసినట్లు ట్రంప్‌ ట్విటర్‌లో ప్రకటించారు. ఇది టర్కీ కరెన్సీ లీరాపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని రోజుల్లోనే లీరా విలువ భారీగా కుప్పకూలింది. తమ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడి చేయడాన్ని టర్కీ తీవ్రంగా పరిగణించింది. ఒక దశలో నాటోను వీడి రష్యావైపు మొగ్గు చూపుతానని నేరుగా బెదిరించింది కూడా. ఇప్పుడు ఏకంగా ఎస్‌-500 ఉత్పత్తి చేస్తానని ప్రకటించడం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. రష్యా తయారు చేసిన ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ ఉంది. అమెరికా మిత్ర, శత్రుదేశాలు ఈ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే భారత్‌ డీల్‌పై సంతకం చేసింది. చైనా ఇప్పటికే కొన్ని ఎస్‌-400 కొనుగోలు చేసింది. తాజాగా ఇరాక్‌ కూడా ఈ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సౌదీ అరేబియా , ఈజిప్ట్‌, వియత్నాం దేశాలు తమ ఆసక్తిని ప్రకటించాయి. అమెరికా ఆంక్షలకు భయపడకుండా వీటి కొనుగోలుకు ముందుకు రావడం విశేషం.