Sports

యువరాజ్ గుడ్‌బై?

Yuvraj Singh In Retirement Plans From International Cricket - tnilive telugu news international telugu sports news

టీమిండియా సీనియర్‌ ఆటగాడు, 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌సింగ్‌ అంతర్జాతీయ మ్యాచులకు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనల్లో ఉన్నాడు. అందుకు సంబంధించి బీసీసీఐ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఐసీసీ అనుమతి పొందిన ఇతర దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా తరఫున ఇక ఆడబోనని అర్థమయ్యాక యువరాజ్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఇక బీసీసీఐ నుంచి సరైన సమాచారం వచ్చాక తనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇర్ఫాన్‌పఠాన్‌ కూడా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు దరఖాస్తు చేసుకున్నాడని, తను ఇంకా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గా కొనసాగుతూ బీసీసీఐ అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. ఇర్ఫాన్‌పఠాన్‌ దరఖాస్తు వెనక్కి తీసుకోవాల్సిందిగా చెప్పామని తెలిపారు. యువీ గురించి ప్రస్తావిస్తూ.. తన విషయంలో ఒకసారి బీసీసీఐ నియమ నిబంధనలు సరిచూసుకోవాలన్నారు. ఒకవేళ యువరాజ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా బీసీసీఐ ఆధ్వర్యంలో టీ20 ఆటగాడిగా కొనసాగుతాడని అధికారి స్పష్టంచేశారు. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన యువరాజ్‌కి సరైన అవకాశాలు రాలేదు. దీంతో తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా యువీకి ఇప్పటికే కెనడా, యూరప్‌లలో జరిగే టీ20 లీగ్‌ మ్యాచుల్లో ఆడేందుకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తన నిర్ణయం చెప్పాక యువీ రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.