Business

న్యూయార్క్ ప్రవాసులకు అశుభవార్త

Air India Cancels New York Mumbai Non Stop Route Due To Losses - TNILIVE Telugu news international tnilive business

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ముంబయి నుంచి న్యూయార్క్‌కు సేవలను రద్దు చేసింది. ఈ మార్గంలో ప్రయాణికుల నుంచి ఆశించినంత డిమాండ్‌ రాలేదు. దీంతో నష్టపోయిన ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబరులో ముంబయి నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్టుకు డైరెక్ట్‌ ఫ్లయిట్‌ సేవలను ఎయిరిండియా ప్రారంభించింది. వారానికి మూడు రోజుల చొప్పున విమానాలు నడిపింది. అయితే ఇటీవల పాక్‌ తమ గగనతలాన్ని మూసివేయడంతో ముంబయి-న్యూయార్క్‌ సర్వీసును తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్‌లో తిరిగి ఈ సేవలను ప్రారంభించాలని ఎయిర్‌లైన్‌ భావించింది. అయితే ఈ మార్గంలో డిమాండ్‌ సరిగా లేకపోవడంతో నష్టాన్ని చవిచూశామని, అందుకే ముంబయి-న్యూయార్క్‌ సేవలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌ దాడితో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత్‌ నుంచి అమెరికాకు విమానాలు నడిపే ఎయిర్‌లైన్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే దీనివల్ల సిబ్బంది కొరత, ఖర్చులు పెరగడంతో ఎయిరిండియా కొన్ని మార్గాల్లో సేవలను నిలిపివేసింది.