Editorials

మరో సైనిక పాలనకు చేరువలో పాకిస్థాన్

Imran Khan Is So Busy To Protect His Government From Military Rule In Pakistan- tnilive telugu latest editorials

పాక్‌లో రాజకీయ ముసలం ఏర్పడే పరిస్థితి నెలకొంది. సాధారణంగా పాక్‌లో సైన్యం చెప్పింది వేదవాక్కు. అక్కడ ఆర్మీ సూచనలను కాదనే రాజకీయ నాయకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. దీనికి ప్రధాన మంత్రులు కూడా మినహాయింపు కాదు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవి చేపట్టడం వెనుక సైనిక సాయాన్ని విశ్లేషకులు కాదనలేరు. ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ బజ్వాతో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పొసగట్లేదు. ఇమ్రాన్‌ పనితీరుపై సైనిక చీఫ్‌ బజ్వా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్‌లో సర్వశక్తిమంతుడైన బజ్వాకు ఆగ్రహం రావడంతో ఇక రాజకీయ రణరంగం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాక్‌కు పై ఒత్తిడి పెంచుతున్న ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)ను ఇమ్రాన్‌ సరిగా డీల్‌ చేయలేకపోతున్నారనేది ప్రధాన ఆరోపణ. పర్వేజ్‌ ముషారఫ్‌ అధికారంలో ఉన్న సమయంలో పలు ఉగ్రమూకలు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా సంచరించేవి. అప్పుడు కూడా ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షలను ఎదుర్కొనలేదు. అటువంటిది ఇమ్రాన్‌ఖాన్‌ పగ్గాలు చేపట్టగానే ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షలు ఎదుర్కొనడాన్ని ప్రభుత్వ అసమర్థతగానే భావిస్తున్నాయి. పాక్ సైన్యం చేసే అరాచకాలు, వ్యక్తుల అదృశ్యాలపై గతంలో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చేవికాదు.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ కేబినెట్‌లో మార్పులు చేసినప్పుడు సైన్యానికి అనుకూలమైన నామినీలకు ఎక్కువ పవర్‌ ఇవ్వాలని ఆర్మీ చీఫ్‌ బజ్వా ఒత్తిడి చేశారు. దీంతో ఇమ్రాన్‌ -బజ్వా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ఆర్మీ చీఫ్‌ ఉత్తర్వులు మేరకు బ్రిగేడియర్‌ ఇజాజ్‌ షాను ఇంటీరియర్‌ మినిస్టర్‌గా నియమించారు. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌గా ఉన్న ఇజాజ్‌ కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించారు. గతంలో ముషారఫ్‌ ప్రభుత్వం ఇజాజ్‌ను ఆస్ట్రేలియాలో హైకమిషనర్‌గా నియమించాలని ప్రయత్నించింది. కానీ, ఒసామా బిన్‌ లాడెన్‌ను పాక్‌లోకి తీసుకురావడంలో, మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య కుట్రలో ఇజాజ్‌ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా ఇజాజ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్‌‌ పార్లమెంట్‌లో సభ్యత్వం లేని 16మందిని కేబినెట్లోకి తీసుకొచ్చారు. ఇదంతా ఇమ్రాన్‌ ఖాన్‌కు చిరాకును తెప్పిస్తోంది. తాను సైన్యం చేతిలో కీలుబొమ్మను కాదని సంకేతాలు ప్రపంచానికి పంపించాలని ఇమ్రాన్‌ ఖాన్‌ నిర్ణయించుకొన్నారు. దీంతో ఆర్మీ చీఫ్‌ బజ్వాకు ఝలక్‌లు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మే2న మొహమాండ్‌ డ్యామ్‌ ప్రారంభోత్సవానికి సైనిక విమానంలో తమతో కలిసి రావాలని ఆర్మీచీఫ్‌ బజ్వా ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కోరారు. వేరే అపాయింట్‌మెంట్లు ఉన్నాయనే సాకుతో ఇమ్రాన్‌ నిరాకరించారు. ఈ కార్యక్రమం తర్వాత పలు విషయాలపై చర్చించేందుకు తమతో కలిసి పెషావర్‌ రావాలని మరోసారి ఆర్మీ చీఫ్‌ కోరారు. కానీ, తాను బిజీగా ఉన్నానని ఇమ్రాన్‌ తప్పించుకొన్నారు. మరోసారి ప్రతిపక్షం విషయంలో సామరస్య వైఖరిని అవలంభించాలని ఆర్మీ చీఫ్‌ బజ్వా ప్రధానికి సూచించారు. కానీ, ఇమ్రాన్‌ ఇవేవీ పట్టించుకోకుండా ప్రతిపక్షాన్ని ఒకసారి ఏకి పారేశారు. ఈ ఘటనలు సైన్యానికి ప్రజా ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచాయి. ఆర్మీ చీఫ్‌ బజ్వా నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరి కొంతకాలం తన పదవిని పొడిగించేలా ఇమ్రాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. కాకపోతే దీనిపై ఆయనే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇది కాకపోతే సౌదీ నేతృత్వంలోని ఇస్లామిక్‌ ఆర్మీ కమాండ్‌లో చేరాలని భావిస్తున్నారు. గతంలో ఆర్మీ చీఫ్‌ రహీల్‌ షరీఫ్‌ కూడా ఇదే విధంగా చేశారు. ఇది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పాక్‌ ఆర్మీ కార్ప్స్‌ కమాండర్ల మీటింగ్ జరిగింది. పౌర-సైనిక సంబంధాలను ఇదే విధంగా ఉండేలా చేయాలని పలువురు కమాండర్లు ఆయన్ను కోరారు. అంటే పౌర ప్రభుత్వంపై సైనిక పెత్తనాన్ని శాశ్వతం చేయాలని అర్థం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఒక పక్క సైనిక బంధనాలను తెంపుకొనేందుకు ప్రయత్నించడం సమీప భవిష్యత్తులో పాక్‌లో అంతర్గత విభేదాలకు కారణం అవుతోంది.