Devotional

అన్నవరంలో వైభవంగా శ్రీపుష్పయాగం

Pushpayagam in Annavaram 2019-tnilive - telugu daily devotional news

1. పర్యాటక కేంద్రంగా ముక్తేశ్వరం
కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. సతీసమేతంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన కేసీఆర్‌ ఆలయంలో గంటపాటు పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్ట్యా ఇక్కడి ఆలయాభివృద్ధికి 100 ఎకరాల స్థలం అవసరమని, దాన్ని సేకరించాలని అధికారులకు చెప్పారు. కల్యాణ మండపంతోపాటు, అన్నిరకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంగా ఒక మహోత్కృష్టమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణానికి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులతో మాట్లాడారు.
2. యాదాద్రిలో నిత్యకల్యాణం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో శనివారం నుంచి నిత్యకల్యాణాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 15వ తేదీ నుంచి 17 వరకు జరిగిన స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా మూడ్రోజులపాటు నారసింహ హోమం, కల్యాణ పర్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. జయంతి ఉత్సవాలు ముగియడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్త దంపతులు శనివారం జరిగిన కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వేసవి సెలవులు కావడంతో పలు జిల్లాలకు చెందిన భక్తులు అధికంగా రావడంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి.
3. వైభవంగా శ్రీవారి గరుడసేవ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి పున్నమి గరుడసేవ శనివారం వైభవంగా జరిగింది. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగ మెరిసిపోతున్న గరుడున్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. తిరుమల ఇన్‌ఛార్జ్‌ జేఈవో లక్ష్మీకాంతం, తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యురాలు, భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు.
4. ఖాద్రీశుని దర్శించుకున్న జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌
అనంతపురం జిల్లా కదిరిలో కొలువైన శ్రీఖాద్రీలక్ష్మీ నరసింహస్వామిని శనివారం ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌కు స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాన్ని అందించారు.
5. నేత్రపర్వంగా శ్రీనివాసుని కల్యాణం
చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామి కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
6. దుర్గమ్మ హుండీల ఆదాయం రూ.1.80 కోట్లు
దుర్గామలేశ్వరస్వామి వార్ల దేవస్ధానం మహామండపం ఆరో అంతస్తులో శనివారం ఈవో వి.కోటేశ్వరమ్మ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల లెక్కించగా 16 రోజులకు 26 హుండీలలో రూ.1,80,81,481 ఆదాయం సమకూరినట్టు, 365 గ్రాముల బంగారం, వెండి 5కిలోల 235 గ్రాములు వచ్చినట్టు ఈవో పేర్కొన్నారు.
7. గరుడ వాహనంపై చెన్నయ్య
హనుమంతునిపాడు మండలంలోని చిన్నగొల్లపల్లిలో మూడు రోజులుగా లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజులగా జరుగుతున్న తిరునాళ్లలో ఆదివారం గరుడ వాహనంపై చెన్నకేశవులు దేవేరులతో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మన్నారాయణుని ప్రతిరూపంగా భక్తులకు చెన్నయ్య దర్శనమివ్వడంతో భారీగా పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొణతాల ప్రదర్శనలో కత్తిసేవ చేసి భక్తులు చెన్నకేశవుని మహిమను కొనియాడారు. పాలేగాళ్లు, పోతురాజులు, గణాచారులతో తిరునాళ్ల కోలాహలంగా మారింది. భక్తులకు దాతలు విరివిగా అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు. చక్కా వంశీయులు చీరాల, గుంటూరు, కృష్ణా, గోదావరి, తెలంగాణా ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి సామూహిక పొంగళ్లు సమర్పించారు. సోమవారం సాయంత్రం తిరునాళ్లలో ప్రాధాన్యత సంతరించుకున్న చెన్నయ్య మహిమలకు ప్రతిరూపమైన కంపకల్లి నిర్వహించేందుకు కమిటీ అధ్యక్షుడు ఎస్‌.రామరాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
8. అన్నవరంలో వైభవంగా శ్రీపుష్పయాగం
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీపుష్పయాగం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. స్వామివారు విష్ణుమూర్తిగా, అమ్మవారు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కనులవిందుగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి భక్తిభావంతో పారవశ్యం చెందారు.
9. తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందిఅన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తులుసర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుందినిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1,00,912నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 2.90 కోట్లు
10. చరిత్రలో ఈ రోజు/మే 20
1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు.
1506 : అమెరికా ను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం (జ.1451).
1932 : లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం (జ.1858).
1955 : ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం
1957 : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణం (జ.1872).
1983 :సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.
1984 : తెలుగు సినీ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ జననం.
1994 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణం (జ.1909).
10. శుభమస్తుతేది : 20, మే 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 46 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 24 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 10 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 31 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 27 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 5 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 11 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : వృచ్చికము
11. తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పనీర్‌ సెల్వం, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్, ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెంశివాజి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.