Sports

ఉత్తినే ఎంపిక చేస్తారు-ఆడనివ్వరు!

The sad story of sunil valson who gets picked into team but never plays - tnilive sunil valson interview - telugu sports news

సునీల్‌ వాల్సన్‌.. ఇప్పటి తరానికి ఇతని గురించి పెద్దగా తెలియదు. కానీ 1983 ప్రపంచకప్‌ నాటి అభిమానులకు మాత్రం తప్పకుండా తెలిసే ఉంటుంది. భారత జట్టు చారిత్రక విజయంలో చోటు దక్కని ఆటగాడిగా నిలిచిపోయిన అతడు ప్రతీ ప్రపంచకప్‌ టోర్నీ ముందు తన గత స్మృతులను నెమరువేసుకుంటాడు. 1983 సంవత్సరం భారత క్రికెట్‌లో సువర్ణ అక్షరాలతో లిఖించదగింది. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ నెగ్గి ప్రపంచ క్రికెట్‌కి తన సత్తా ఏంటో ఘనంగా చాటిచెప్పింది. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని టీమిండియా ఏమాత్రం అంచనాల్లేకుండా వెళ్లి ఏకంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో మొదటిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతటి ఘన చరిత్ర కలిగిన జట్టులో సభ్యుడిగా ఉండి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేని ఒకే ఒక్క ఆటగాడు సునీల్‌ వాల్సన్‌. మరికొద్ది రోజుల్లో 2019 ప్రపంచకప్‌ టోర్నీ జరగనుండగా వాల్సన్‌ తన అనుభవాలను గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘1983 ప్రపంచకప్‌ ప్రారంభానికి సరిగ్గా 12 రోజుల ముందు నేను ఇంగ్లండ్‌లో ఓ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే భారత జట్టుకు ఎంపికయ్యానని తెలిసింది. అది నాకేమీ పెద్ద విశేషమని అనిపించలేదు. ఎందుకంటే తుది 11 మందిలో నేనుండనని తెలుసు. ప్రతీ నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్‌లో నన్ను అలా ఎంపిక చేస్తారు. ఇందులో ఎలాంటి హాస్యాస్పదం కానీ వేరే ఉద్దేశం కానీ లేవు. అలా జరిగిపోయింది’ అని వివరించాడు. ప్రపంచకప్‌లో ఆడలేకపోవడం బాధగా అనిపించిందా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నాడు. ‘అప్పుడు యువ క్రికెటర్‌గా ఉన్నా.. ఇప్పుడు సీనియర్‌ సిటిజెన్‌గా మారుతున్నా. ఎప్పుడూ బాధ పడలేదు. ఎందుకంటే 1983 ప్రపంచకప్‌ భారత జట్టు 14 మందిలో నేనూ ఒక సభ్యుడినే. దాన్ని ఎవరూ కాదనలేరు. లీగ్‌ మ్యాచులకు ముందు వార్మప్‌ మ్యాచుల్లో ఆడా. ఆ రెండు మ్యాచుల్లో మా జట్టు ఓడిపోయింది. అయితే వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. తర్వాత మొత్తం మారిపోయింది. ఆ టోర్నీలో ఒక్కమ్యాచ్‌ ఆడేందుకైనా కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే రెండో రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో మరోసారి వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మేం 66 పరుగులతో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లో రోజర్‌ అనే బ్యాట్స్‌మెన్‌ ఏదో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో కపిల్‌ నా దగ్గరికొచ్చి రోజర్‌ ఫిట్‌నెస్‌ పరీక్ష ఫెయిలైతే నన్ను జట్టులోకి తీసుకుంటామని చెప్పాడు. కానీ ఆ పరీక్షలో అతడు ఫిట్‌నెస్‌ సాధించాడు’ అని వాల్సన్‌ వివరించాడు. ‘అప్పట్లో ఫిట్‌నెస్‌ పరీక్ష అంటే జాగింగ్‌ చెయ్యడంతో పాటు కొన్ని తేలికపాటి కసరత్తులు, బంతులు విసరడం. ఆ రోజు రోజర్ పరిగెడుతుంటేనే అర్థమైంది. ఇక నేను ఆడలేనని తెలిసింది. అయితే రోజర్‌ మాత్రం ఆ టోర్నీలో అద్భుత ఫామ్‌తో చెలరేగాడు. నిజం చెప్పాలంటే ప్రపంచకప్‌ మొత్తంలో రోజర్‌బిన్నీ, కపిల్‌దేవ్‌, మదన్‌లాల్‌ మాత్రమే అన్ని మ్యాచులూ ఆడారు. ఇక అనుకోకుండా నాకు ఓసారి ఫీల్డులోకి వెళ్లే అవకాశం వచ్చింది. ఓ మ్యాచ్‌లో దిలీప్‌ వెంగ్‌సర్కార్‌కి గాయమైతే.. అతడిని డ్రెస్సింగ్‌ రూమ్‌కి తీసుకు వచ్చాను’ అని పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్‌లో తనని ఆడించని విషయం బాధించలేదని, వేరే విషయం మాత్రం తీవ్రంగా కలచివేసిందన్నాడు. 1979 నుంచి 1983 వరకు తాను మంచి ఫామ్‌లో ఉండి వికెట్లు తీసినా భారత జట్టు క్యాప్‌ ధరించే అవకాశం రాలేదని, అదే తనని బాధించిందని వాపోయాడు. ఇక అప్పటి ఆటగాళ్లు ఎవరైనా టచ్‌లో ఉన్నారా అని ప్రశ్నించగా.. తమకో వాట్సాప్‌ గ్రూప్‌ ఉందని, ఏటా జూన్‌ 25న అందరూ అభినందనలు తెలుపుకొంటామని చెప్పాడు. తన జీవితంలో ఈ నెల చాలా ప్రత్యేకమైందని వివరించాడు.